అమెరికాలో శాన్వి హత్య: నన్ను చంపేయండంటూ రఘునందన్ ఆక్రోశం
న్యూయార్క్: తన తరఫు న్యాయవాదులపైనే అమెరికాలో చిన్నారి శాన్వీ, నాయనమ్మ సత్యవతిని హత్య చేసిన కేసులో నిందితుడు రఘునందన్ ఆక్రోశం వెల్లగక్కాడు. మీతో అయ్యే పని కాదని, మళ్లీ విచారణ కోరడానికి బదులు వెంటనే మరణశిక్ష అమలు చేయడం మంచిదని అతను తన న్యాయవాదులపై విరుచుపడ్డాడు.
29 ఏళ్ల రఘునందన్ రెండు హత్యలు చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఇప్పటికే మరణ శిక్ష విధించింది. ఈ తీర్పుపై అతను మళ్లీ అప్పీలుకు వెళ్లాడు. అతని తరఫున హెన్రీ హిల్లెస్, స్టీఫెన్ హెక్‌మన్ అనే న్యాయవాదులు వాదిస్తున్నారు. సోమవారం మాంట్‌గొమెరీ కౌంటీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ కోర్టు హాలులోనే తన న్యాయవాదులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తాను ఫోన్ చేసినా స్పందించడంలేదని, లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని అతను వారిపై మండిపడ్డాడు. మళ్లీ కొత్తగా విచారణ కోరడం అనవసరని, తనకు విధించిన మరణశిక్ష వెంటనే అమలు చేయడమే మంచిదని కేకలు వేశాడు.

కాగా, రఘునందన్ వైఖరి కాస్త నాటకీయంగా ఉందని జడ్జి స్టీవెన్ ఓనీల్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసి హెక్‌మన్, హిల్లెస్ మంచి న్యాయవాదులని చెప్పారు. అయినా కూడా రఘునందన్ పట్టించుకోలేదు. న్యాయవాదులు, జడ్జి వారించినప్పటికీ తన వాదనలు తానే వినిపించుకుంటానంటూ లాయర్ అవతారమెత్తాడు. ఇలాంటి కేసుల్లో నేరం రుజువైతే మరణశిక్ష అమలు చేయడమే కరెక్ట్ అని తనకు తానుగా తేల్చేశాడు.
తాజా విచారణ అక్కర్లేదని, తనకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని రఘునందన్ కోరడం ఇదే మొదటిసారి కాదు. సోమవారం కూడా ఇలాగే స్పందించాడు. రఘునందన్ ఆరోపణలతో దిగ్ర్భాంతికి గురయ్యామని లాయర్లు హెక్‌మన్, హిల్లెస్ కోర్టు బయట మీడియాతో అన్నారు. ఈ కేసులో గత ఏడాది అక్టోబర్ 14న న్యాయస్థానం రఘునందన్‌కు మరణ శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications