భారత్ పై సుంకాలు విధించి గొడవ తెచ్చుకున్నా..! అంగీకరించిన ట్రంప్..!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో మన దేశంపై సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీని వల్ల తలెత్తిన పరిణామాలపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తన కంటే యూరప్ దేశాలకే ఎక్కువ బెంగ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. భారత్ పై సుంకాల విధింపు పెద్ద విషయమేనని ట్రంప్ అంగీకరించారు. దీనివల్ల తలెత్తుతున్న పరిణామాలపై ఆయన ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు..
రష్యా చమురును కొనుగోలు చేస్తూ ఆ దేశానికి అతిపెద్ద కస్టమర్ గా మారిన భారత్ పై సుంకాల విధింపు చిన్న విషయమేమీ కాదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది తమ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైందన్నారు. పుతిన్ ను ఇరుకునపెట్టడం అంటే ఏంటనే ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ ఈ విషయాలు వెల్లడించారు. తాను ఇప్పటికే భారత్ పై సుంకాలు విధించేశానని, ఆ మాటకొస్తే తాను వారికి చాలా చేశానని చెప్పుకొచ్చారు. ఇది (భారత్ రష్యా చమురు కొనడం) తన కంటే యూరప్ కే పెద్ద సమస్య అని అన్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తన పదవీకాలంలో తాను ఎన్నో యుద్దాలు ఆపినట్లు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. తాను ఇప్పటిపరకూ ఏడు యుద్ధాలను ఆపినట్లు తెలిపారు. పాకిస్తాన్, భారతదేశంతో సహా చాలా యుద్ధాలను తాను పరిష్కరించినట్లు చెప్పుకొచ్చారు. ఇందులో కొన్ని పెద్దవి, కొన్ని పరిష్కరించలేనివి కూడా ఉన్నాయన్నారు. ఇలాంటిదే కాంగో- రువాండా యుద్దాన్ని తాను పరిష్కరించినట్లు తెలిపారు.ఇది 31 సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు. లక్షలాది మంది మరణించారన్నారు. పరిష్కరించలేని యుద్ధాలను నేను పరిష్కరిస్తానంటూ ట్రంప్ తనకు తానే కితాబిచ్చుకున్నారు.

రష్యా చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు. ఇందులో 25శాతం సుంకం కాగా మరో 25 శాతం పెనాల్టీగా అభివర్ణించారు. ఈ సుంకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. దీంతో భారత్ తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి జీఎస్టీ రేట్లు తగ్గించింది. దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆర్ధిక వ్యవస్థపై ట్రంప్ సుంకాల ప్రభావం పడకుండా చేయాల్సిందంతా చేస్తోంది.












Click it and Unblock the Notifications