విజయ్ మాల్యా చేసిన మోసాలే రామోజీ రావు చేశారు: ఉండవల్లి
మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఇటీవలే ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం ఈ మేరకు కేసు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్, చిట్ ఫండ్ చట్టాన్ని మార్గదర్శి యాజమాన్యం ఉల్లంఘించినట్లు తేలడంతో కేసు నమోదు చేశారు. ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు.
దీనికి కొనసాగింపుగా సీఐడీ అధికారులు ఆయనను విచారించారు. అయిదు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. మార్గదర్శి ఛిట్‌ఫండ్స్‌లో మోసాలకు సంబంధించిన 46 ప్రశ్నలను వారు రామోజీ రావు ముందు ఉంచారు. వాటన్నింటికీ సమాధానాలను రాబట్టుకున్నారని తెలుస్తోంది. రామోజీ రావు అనారోగ్యానికి గురైనప్పటికీ- సీఐడీ అధికారులు తమ విచారణను కొనసాగించారు. బెడ్‌పై నుంచి సమధానాలను ఇచ్చారు. ఇది ఇక్కడితో ముగియలేదు. ఎల్లుండి శైలజా కిరణ్‌పై ప్రశ్నల వర్షాన్ని కురిపించనున్నారు ఏపీ సీఐడీ అధికారులు.

కాగా- మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసులో చోటు చేసుకున్న అక్రమాలు, ఆర్థిక మోసాలపై రామోజీ రావును సీఐడీ అధికారులు విచారించడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్వాగతించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం- నిబంధనలను ఉల్లంఘించిందనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సబ్ స్క్రైబర్ల నుంచి సేకరించిన డబ్బులను ఆ సంస్థ యాజమాన్యం- తమ గ్రూప్ కంపెనీల్లోని ఇతర వ్యాపారాల కోసం వాడుకుందని పునరుద్ఘాటించారు.
రాజమండ్రిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీ ఛిట్‌ఫండ్స్ యాక్ట్ ప్రకారం ఇది నేరమని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రెండు లక్షలమంది సబ్‌స్క్రైబర్లకు డబ్బులు తిరిగి ఇచ్చానని రామోజీ రావు చెబుతున్నాడని, దీనిపై ఓ జాబితాను ఆయన విడుదల చేయగలరా? అని సవాల్ విసిరారు. అలా చేస్తే రామోజీ రావు గొప్పోడని తాను అంగీకరిస్తానని అన్నారు. అందరికీ ఇచ్చేశానని ఆయన చెబితే తాము నమ్మాల్సిందేనా? అని ప్రశ్నించారు.

వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన విజయ్ మల్యా చేసిన తప్పే రామోజీ రావు కూడా చేశాడని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మీడియా సంస్థలు, దినపత్రికలను నడిపే వారికి చట్టాల నుంచి మినహాయింపు ఏమైనా ఉందా? అని ఉండవల్లి ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్లు, భారతరత్న అవార్డు గ్రహీతలకు ఉన్నట్లు ఎలాంటి అక్రమాలు చేసినా రామోజీ రావుపై చర్యలు తీసుకోకుండా ఆయనకు ప్రత్యేకంగా ఇమ్యూనిటీ పవర్‌ను ఇచ్చేస్తే ఏ గొడవా ఉండదని వ్యాఖ్యానించారు. రామోజీ రావుకు భారతరత్న ఇచ్చి గౌరవించుకుంటే- ఏ అక్రమాలు చేసినా ఆయన జోలికి ఎవరూ వెళ్లరని పేర్కొన్నారు.
రామోజీ రావును జైలుకు పంపాలని తానేమీ కోరుకోవట్లేదని, ఆయనతో ఒక్క రూపాయి అయినా ఫైన్ కట్టించాలని ఉండవల్లి అన్నారు. ఆయన తప్పు చేశాడనేది ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారే చట్టానికి అతీతుడు కాడని, చట్టాన్ని ఉల్లంఘించినందుకు టీటీడీపై కేంద్ర ప్రభుత్వమే 10 కోట్ల రూపాయల జరిమానా విధించిందని ఆయన గుర్తు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరినీ ఉపేక్షించకూడదని చెప్పారు.












Click it and Unblock the Notifications