అనుమానం పెనుభూతం: భార్య, కొడుకును చంపి భర్త ఆత్మహత్య
నల్గొండ: అనుమానమే పెనుభూతమై ఓ కుటుంబాన్ని బలితీసుకుంది. జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువులో జరిగిన దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సుర్వి మ హేశ్ (30),అనూష (25) దంపతులకు నివేదిక్ అలియాస్ బిట్టు (9నెలలు) కొడుకు ఉన్నాడు.
బిట్టు పుట్టినప్పటి నుంచి భార్యపై మహేశ్ అనుమానం పెంచుకుని తాగొచ్చి వేధిస్తున్నాడు. దీంతో అనూష పుట్టింటికి వెళ్లింది. నాలుగు నెలల కిందట మహేశ్ వెళ్లి మామను కొట్టడంతో అనూషను పంపేందుకు నిరాకరించారు.

ఇటీవల వెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి అనూషను ఇంటికి తీసుకొచ్చాడు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. గురువారం బంధువు అంత్యక్రియలకు వెళ్లొచ్చిన మహేశ్... భార్య, కొడుకు గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అతడు కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు.
వివాహిత అనుమానాస్పద మృతి
నల్గొండ: దేవరకొండ మండలం నడమడక మజరా షాకెల్లి గ్రామంలో గురువారం ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన గుండాల యాదమ్మ అలియాస్ రజిత గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని మృతిచెందింది.
మృతురాలికి భర్త, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. భర్తే హత్య చేసి ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications