Bhadradri Thermal Power Plant: భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో పిడుగు పడడంతో ప్రమాదం సంభవించింది. పిడుగుతో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఒకటో యూనిట్‌లో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విద్యుత్ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కొనసాగుతోంది. ఈ విద్యుత్ కేంద్రంలోన 2 యూనిట్లలో 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉంది.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టుకు 28-మార్చి-2015న శంకుస్థాపన చేశారు. తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.












Click it and Unblock the Notifications