కోట్లకు పడగలెత్తిన బిల్‌కలెక్టర్: ఏసీబీ రాకతో బాత్రూంలో దూరి..
హైదరాబాద్: అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో అబిడ్స్‌లో విధులు నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్ నర్సింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కూకట్‌పల్లి శాతవాహననగర్, బాలానగర్ జగద్గిరిగుట్టలోని నివాసాల్లో శుక్రవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఆయనకు 3 ఇళ్లు, 6 ప్లాట్లు, 90 తలాల బంగారం, సిద్దిపేటలోని నుంగనూరులో 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఏసీబీ అధికారులు నర్సింహారెడ్డికి చెందిన రూ.కోటికి పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు.
నర్సింహారెడ్డికి సంబంధించిన బ్యాంకు లాకర్లను తెలియాల్సి ఉంది. మార్కెట్ విలువ ప్రకారం అతని ఆస్తుల విలవ రూ. 6కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

కాగా, ఏసీబీ అధికారుల రాకను చూసిన సదరు బిల్ కలెక్టర్ బాత్రూంలోకి దాక్కున్నట్లు తెలిసింది. అంతేగాక, అధికారులు తన నివాసం నుంచి వెళ్లిపోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు గురిచేశాడు.
అయితే, ఏసీబీ అధికారులు అతడ్ని బయటికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబసభ్యులతో మాట్లాడారు. నర్సింహారెడ్డిని విచారించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా, తమ ఆస్తులన్నీ గతంలో ఇతర ఇతరుల వద్ద తక్కువ ధరకు కొన్నవేనని నర్సింహారెడ్డి తెలిపారు. ఇప్పుడు వాటి విలువ పెరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications