కేసీఆర్ ఆరిపోయే దీపం, సీఎం సీటు కోసమే ఫ్యామిలీ ఫైట్: ఈటల రాజేందర్, విజయశాంతి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆరిపోయే దీపమని వ్యాఖ్యానించారు. శుక్రవారం కరీంనగర్‌లో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ ఈటల రాజేందర్
కేసీఆర్ పని అయిపోయిందని, ఆయన ఆరిపోయే దీపమని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోందన్నారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల రాజేందర్.. కరీంనగర్ లో ఒక ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిపారు. కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కరీంనగర్‌లో టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, ఆదిలాబాద్ లో కూడా జడ్పీటీసీ రాజేశ్వర రెడ్డిని పోటీలో పెట్టించానని ఈటల రాజేందర్ తెలిపారు.

కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం కుస్తీ: విజయశాంతి
మరోవైపు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి స్థానం కోసం వార్ మొదలైందని.. ప్రగతి భవన్‌లో కుస్తీ ఫైటింగ్ జరుగుతోందని విజయశాంతి అన్నారు. కుటుంబ పంచాయితీతో కేసీఆర్ తల పట్టుకుంటున్నాడని తెలిపారు. తెలంగాణలో భవిష్యత్‌లో టీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసం ఢిల్లీ పర్యటన కు వెళ్ళారని విమర్శించారు. కేసీఆర్ గురించి పీహెచ్ డీ చేశాను.. ఆయన ఏది చెప్తే అది చేయరని అన్నారు విజయశాంతి. కాంగ్రెస్.. టీఆర్ఎస్ కు స్టెప్నీ.. తన అవసరాల కోసం కాంగ్రెస్ ను వాడుకుంటారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు సీట్లు తక్కువ పడితే ఆ పార్టీ సీట్లు వాడుకుంటారని అన్నారు.

కేసీఆర్.. తెలంగాణ రైతులను ఆదుకోండి ముందు
టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటేనని విమర్శించారు. తాను ఎక్కడ పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కేసీఆర్ పై కచ్చితంగా విచారణ ఉంటుందని చెప్పారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసి.. తర్వాత బయటి రాష్ట్రం రైతులకు న్యాయం చేయాలన్నారు బీజేపీ నేత విజయశాంతి. ప్రధాని అపాయింట్మెంట్ కావాలంటే ముందుగానే తీసుకోవాలన్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారో అర్థం కావడం లేదన్నారు. అసలు కేసీఆర్‌ను ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు విజయశాంతి. కేసీఆర్ రైతులకు ఏ విధంగా ద్రోహం చేశారో అందరికీ తెలుసన్నారు. తెలంగాణలోని రైతులకు రుణమాఫీ చేయరు.. రైతులకు పరిహారం ఇవ్వరు కానీ.. పంజాబ్ రైతులకు ఇస్తానంటే ఎవరూ నమ్ముతారని విజయశాంతి ప్రశ్నించారు.

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ డ్రామాలంటూ తరుణ్ ఛుగ్
తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ కూడా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రేపు ఎన్నికలకు వెళ్లిన ఆయనకు అభ్యర్థులు దొరకరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. కుటుంబం, అవినీతి పార్టీకి కాలం చెల్లిందని విమర్శించారు. తమకు అభ్యర్థులు ఉన్నారు.. 70కి పైగా కన్నా ఎక్కువ సీట్లను గెలుచుకుంటామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని... బీజేపీ మీద విశ్వాసం పెరిగిందన్నారు. తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. తాము ధాన్యం కొనమని ఎక్కడ చెప్పలేదు. ప్రతి గింజ కొంటాం. పేదలకు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ స్కీంలను అందనీయడం లేదని పేర్కొన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ కి పోయి కేసీఆర్ ఏమి చేసిండు కేసీఆర్ ఒక అబద్ధాల కోరు ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాతో రెండు డజన్ల టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారని తరుణ్ చుగ్ అన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్ పతనం అవుతుందన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని తరుణ్ చుగ్ హితవు పలికారు.