హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!
రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా దినదినాభివృద్ధి చెందుతోంది. అటు టెక్, ఐటీ సంస్థలు.. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంది భాగ్యనగరం. హైదరాబాద్ లో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. అయితే జనాభాతో పాటు వాహనాలు కూడా భాగ్యనగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూస్తే 85 లక్షల 22 వేల 286 లుగా ఉంది. ఇందులో ద్విచక్రవాహనాలు 62,85,582 ఉన్నాయి. మొత్తం వాహనాల్లో ఇంచుమించు మూడొంతులు ఇవే కావడం గమనార్హం. అలాగే మధ్యతరగతి, ఉన్నతాదాయ వర్గాలు ఎక్కువగా వినియోగించే కార్లు సైతం 15,72,795కు చేరుకున్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయలేని పరిస్థితి. దీంతో నగరవాసులు పార్కింగ్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

భాగ్యనగర ప్రజల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో 30 చోట్ల ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని నిర్ణయించింది. గతంలో అంటే 2017లో ఈ ప్రతిపాదనలు చేసినా.. అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ కష్టాలకు పార్కింగ్ సముదాయాలే పరిష్కారమని నిపుణులు తేల్చిచెప్పడంతో జీహెచ్‌ఎంసీ మళ్లీ ఈ ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే కేబీఆర్ పార్కు, నాంపల్లి చౌరస్తాలో నిర్మించిన పార్కింగ్ కాంప్లెక్స్ లు సక్సెస్ కావడంతో అలాంటి సముదాయాలను మరికొన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్‌ఎంసీని ఆదేశించారు.
ఇక ఇటీవల కోకాపేట వద్ద హెచ్‌ఎండీఏ నిర్మించిన ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా నియోపోలిస్ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అలాగే ఈ జంక్షన్ నియోపొలిస్ లేఅవుట్ ను ఔటర్ రింగ్ రోడ్డుతో కలుపుతుంది, ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గిస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది.












Click it and Unblock the Notifications