కవిత ఏకగ్రీవం.!అందుకున్న ఎమ్మెల్సీ దృవీకరణ పత్రం.!నివాసం దగ్గర సంబురాలు.!
నిజామాబాద్/హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండో సారి చట్ట సభలో తన ప్రయాణం కొనసాగించబోతున్నారు కవిత. అంతకు ముందు ఎమ్మెల్సీగా ఏకగ్రీంగా ఎన్నికైన కవితకు రిటర్నింగ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రం అందించారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కవిత ఎమ్మెల్సీగా రెండో సారి గెలుపోందారు. ఇందుకు సంబందించి ఎన్నికల అధికారి నియామక పత్రం అందజేశారు.

అంతా గులాబీమయం.. రెండోసారి విజయం సాధించిన కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి నుండి ధృవీకరణ పత్రాన్ని కవిత అందుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు కవిత. అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు గమనించి పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం. ధృవీకరణ పత్రం అందించిన రిటర్నింగ్ ఆఫీసర్
అంతే కాకుండా ఎన్నికలలో సహకరించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల నాయకులకులందరికి కవిత కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 90 శాతం ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, కవిత గెలుపుకు కృషి చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య పాత్ర పోషిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

పెద్దల సభకు రెండోసారి.. కవిత పొలికల్ జర్నీ
ఇదిలా ఉండగా పధ్నాలుగు నెలల క్రితం ఎమ్మెల్సీగా నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కవిత ఎన్నికయ్యారు. అయితే అప్పట్లో ఏకకగ్రీవం కాలేదు. పోటీ జరిగింది. అయితే ఇతర పార్టీల ఓటర్లతో సహా గులాబీ నేతలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడంతో కవిత భారీ మెజారిటీతో గెలిచారు. వచ్చే జనవరితో పదవి కాలం ముగుస్తుంది. గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఆ స్థానంలో కల్వకుంట్ల కవిత పోటీ చేసి విజయం సాధించారు.

ఎంపీగా మళ్లీ పోటీచేసే అవకాశం.. అందుకు నిజామాబాద్ జిల్లాకు ప్రాముఖ్యత
ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో ఆ స్థానంలో కవితకు చాన్సిస్తారని అనుకున్నారు. కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఓ సారి గెలిచిన కవిత, గత ఎన్నికల్లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మళ్లీ నిజామాబాద్ కే కవిత ప్రాముఖ్యతనిచ్చారనే చర్చ జరుగుతోంది.