మన్నించండి: బ్రాహ్మణులపై తీవ్ర వ్యాఖ్యలపై తగ్గిన కంచె ఐలయ్య
హైదరాబాద్: తిని కూర్చునే సోమరులుగా బ్రాహ్మణులను అభివర్ణించిన కంచె ఐలయ్య ఎట్టకేలకు దిగొచ్చారని తెలుస్తోంది. బ్రాహ్మణుల పైన తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పారని అంటున్నారు. బ్రాహ్మణుల నిరసన నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పారంటున్నారు.
ఈ సందర్భంగా కంచె ఐలయ్య తన వ్యాఖ్యల పైన వివరణ ఇస్తూ... బ్రాహ్మణిజానికి మాత్రమే తాను వ్యతిరేకినని, బ్రాహ్మణులకు కాదన్నారు.
తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించాలని ఆయన బ్రాహ్మణులను కోరారు. బ్రాహ్మణుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందన్నారు. తాను చేయని వ్యాఖ్యలను ఓ తెలుగు దినపత్రిక రాసిందని ఆరోపించారు.

విజయవాడ కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బ్రాహ్మణుల పైనే కాకుండా హిందూ దేవుళ్ల పైనా కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మొన్న ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమరులుగా ఉన్న బ్రాహ్మణుల అడ్రెస్‌లు చెబితే దండిస్తామంటూ ఐలయ్యకు చురకలు అంటించారు. దీంతో, కంచె ఐలయ్య తగ్గారు. తాజాగా సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఐలయ్యను కలిసిన బ్రాహ్మణులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పై వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications