డబ్బులు అందుతున్నాయా?: కేసీఆర్‌ను ఆరా తీసిన మోడీ, గవర్నర్ వివరణ
పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. డీజీపీల సదస్సులో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని శుక్రవారం సాయంత్రం 6.26 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రధాని రాకకు గంట ముందు విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయన రాగానే పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ప్రధాని నేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి వెళ్లాల్సి ఉంది. కానీ, అలా వెళ్లకుండా అక్కడే కొద్దిసేపు ఆగారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో పది నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పెద్ద నోట్ల రద్దు అనంతర పర్యవసానాల గురించి వారిద్దరి వద్ద ఆరా తీసినట్లు తెలిసింది.

బ్యాంకుల నుంచి ప్రజలకు అవసరమైన మేరకు డబ్బులు అందుతున్నాయా? ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా? నగదు నిల్వలు చేరాయా? అని సీఎం కేసీఆర్‌ను ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు చేరుతున్నాయా? అని ప్రధాని అడిగినట్లు తెలిసింది.
కాగా, చిన్న నోట్ల కొరత ఉందని సీఎం కేసీఆర్.. ప్రధాని దృష్టికి తెచ్చారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదన్నారు. రూ.రెండు వేల నోటుకు చిల్లర సమస్యగా ఉండటంతో దానిని తీసుకోవడానికి ప్రజలు ఇష్టపడడం లేదని ప్రధానికి వివరించారు.
రోజుకు రూ.రెండేసి వేల పరిమితితో రైతులకు అవసరాలకు తగ్గట్టుగా డబ్బు అందడం లేదని వివరించినట్లు తెలిసింది. విత్తనాలు, ఎరువుల సరఫరా సందర్భంగా రైతులకు ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. రూ. 500 నోట్లు రాష్ట్రానికి పంపించామని ప్రధాని చెప్పగా.. అవి శుక్రవారమే రాష్ట్రానికి చేరాయని సీఎం పేర్కొన్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని గవర్నర్ నర్సింహన్.. ప్రధానికి చెప్పారు. నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ఏటీఎంలలో నిల్వలు పెంచితే ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. చిన్న నోట్ల కొరత త్వరలోనే తీరుతుందని, రాష్ట్రానికి సత్వరమే నగదు నిల్వలు చేరేలా ఆదేశాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ రమోడీ తెలిపారు.
రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా కేంద్రం చర్యల తీసుకుంటుందన్నారు. కొద్ది రోజుల్లోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నల్లధనం ప్రభావం గురించి కూడా ప్రధాని ఆరా తీసినట్లు సమాచారం. నోట్ల రద్దు నిర్ణయంపై రాష్ట్రాలు తమకు మద్దతు ఇస్తున్నాయని.. ఈ పరిణామంతో నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రదాని మోడీ అభయం ఇచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications