ఆంధ్రకు పనులు చేస్తూ తెలంగాణను పక్కన పెట్టారు: మోడీపై కల్వకుంట్ల కవిత
నిజామాబాద్: బీహార్ ఎన్నికల ఫలితాలు చూసైనా ప్రధాని నరేంద్ర మోడీ కళ్లు తెరవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ప్యాకేజీలు ప్రకటించడం సరికాదని ఆమె అన్నారు.
అసహనం, మతపరమైన విషయాలపై మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారని అభిప్రాయపడ్డారు బీహార్‌లో ప్రజలే గెలిచారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాకు పనులు చేస్తూ తెలంగాణ సమస్యలను పక్కనపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కృషి చేస్తున్నారని ఆమె చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారంనాడు ప్రారంభించారు.
బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేయనున్నట్లు తెలిపారు. శాసనసభ్యుడు జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్మూర్ ఆరోగ్య పథకాన్ని కూడా మహమూద్ అలీ ప్రారంభించారు.












Click it and Unblock the Notifications