ప్రత్యూషను ఇబ్బంది పెట్టొద్దు: టి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, తండ్రి రమేష్‌కుమార్‌ల చేతుల్లో చిత్రహింసలకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను హాజరుపపర్చడంలో ఆమెను ఎలాంటి ఇబ్బందులకూ గురి చేయవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ప్రత్యూష కష్టాలపై మీడియాలో వచ్చిన కథనాలకు చలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం రాసిన లేఖను హైకోర్టు ధర్మాసనం తనకు తానుగా విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ప్రత్యూషను సోమవారం న్యాయస్థానంలో హాజరుపరచాల్సి ఉంది.
అయితే ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాకపోవడంతో హాజరుపరచలేకపోయామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. దీనిపై ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్‌వి భట్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఎప్పుడు డిశ్చార్జి అయితే అప్పుడే ప్రవేశపెట్టాలని సూచించింది.

కేసు విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఒకవేళ కోర్టు ముందు హాజరుకావడానికి ప్రత్యూష ఇష్టపడకపోతే ఒత్తిడి తీసుకురావద్దని స్పష్టం చేసింది. ఇందులో తమ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదని, ఆమెకు ఆసక్తి ఉంటేనే హాజరుకావచ్చని తెలిపింది.
కోర్టుముందుకు రావడానికి ప్రత్యూష సంసిద్ధత వ్యక్తం చేశారని, ఎలాంటి ఒత్తిడికీ లోనుకావడంలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ శరత్‌కుమార్ కోర్టుకు నివేదించారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఛాంబర్‌లో హాజరుపరచాలని, ఈ సమయంలో మీడియా సహా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా న్యాయమూర్తులు వినియోగించే లిఫ్ట్‌లో తీసుకురావాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.












Click it and Unblock the Notifications