వరుణదేవుడి దయ కోసం: పూడ్చిన శవాలను వెలికి తీసి పూజలు
నల్లగొండ: ఆధునిక విజ్ఞానం విస్తరిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు తొలగిపోవడం లేదని చెప్పడానికి ఓ విచిత్రమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటు చేసుకుంది. కరవు పరిస్థితులు ఏర్పడడం, వర్షాభావంతో పంటలు ఎండిపోతుండడంతో గ్రామానికి కీడు వచ్చిందని భావించిన గ్రామస్థులు పూడ్చిన శవాలను వెలికితీసి పూజలుచేశారు.
సంఘటన నల్లగొండ జిల్లాలోని మోతె మండలం సిరికొండ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. అందుకు సంబంధించి ఓ తెలుగు దినపత్రిక వెల్లడించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి- వర్షాలు లేకపోవడంతో పంటలు ఎండిపోవడంతో పాటు చెరువు, కుంట అడుగంటడంతో గ్రామంలోని చెరువుశిఖం భూమిలో శవాలను పూడ్చడం వల్లే గ్రామానికి కీడు సోకి వర్షాలు పడడం లేదని భావించిన గ్రామస్థులు బుధవారం సమావేశమై పూడ్చిన శవాలను బయటకు తీసి పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు.

అంతా ఏకమై ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందిన ఆలకుంట్ల నర్సయ్య, తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన అవివాహిత ఉప్పల సరిత మృతదేహాలు పూడ్చిన చెరువుశిఖం వద్దకు వెళ్లి తవ్వి ఎముకలను బయటికి తీసి మంత్రగాళ్లతో పూజలు చేయించి అనంతరం పూడ్చిపెట్టారు.
అదే రోజు రాత్రి గ్రామంలో ఓ మోస్తరుగా వర్షం కురియడంతో కీడు తొలగిందని గ్రామస్థులు గంతులేశారు. కాగా, ఈ ఉదంతం ఆనోటా, ఈనోటా పడి శుక్రవారం వెలుగులోకి రావడంతో సమాచారం అందుకున్న మోతె ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు.
మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు. మూఢనమ్మకాల పేరుతో అనాగరిక చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications