చిలుకూరు ఆలయంలో ప్రియాంక చోప్రా.. ఆ పోస్టుపై చర్చ
ప్రముఖ సినీనటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో దిగిన పలు ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ప్రియాంక చొప్రా పంచుకున్నారు. భగవంతుడి దయ అనంతరం అని వ్యాఖ్యానించారు.
అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అని క్యాప్షన్‌లో పెట్టారు. మరోవైపు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ సతీమణి, అపోలో సంస్థల వైస్ ఛైర్ పర్సన్ ఉపాసనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లవ్ ఎమోజీలు జోడించారు ప్రియాంక చోప్రా. ఇందుకు ఉపాసన స్పందిస్తూ.. 'మీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.. శ్రీవేంకటేశ్వరస్వామి అనుగ్రహం మీకు ఉంటుంది' అని బదులిచ్చారు.

ఇక, బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నారు. లాస్ఏంజెల్స్ ఉంటున్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న SSMB29(వర్కింగ్ టైటిల్)లో ప్రియాంక చోప్రా నాయికగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమాలో నటించేందుకే హైదరాబాద్ వచ్చారని, సోషల్ మీడియాలో ప్రియాంక చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సినిమా గురించేనని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications