రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్: ఎందుకంటే?
హైదరాబాద్: రిమోట్ ఓటింగ్ విధానంపై ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు అనుకూలంగా, మరికొన్ని పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. తాజాగా, బీఆర్ఎస్ కూడా తన వైఖరిని వెల్లడించింది. రిమోట్ ఓటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, బీఆర్ఎస్ కీలక నేత బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
పార్టీలో చర్చించి జనవరి 30లోగా కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా బీఆర్ఎస్ అభిప్రాయాలను తెలుపుతామన్నారు. రిమోట్ ఓటింగ్ పద్ధతి దేశంలో అవసరం లేదని, అభివృద్ధి చెందిన దేశాలే ఈ విధానాన్ని పక్కన పెడుతున్నాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఢిల్లీలో ఎన్నికల సంఘం సమావేశం నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వినోద్ కుమార్ ఈ మేరకు స్పందించారు. ప్రస్తుత ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలనే హ్యాక్ చేస్తున్నారనే అనుమానాలు, ప్రచారాలు బలంగా ఉన్నాయని, వాటినే ఈసీ ఇప్పటి వరకు నివృత్తి చేయలేదని అన్నారు. అలాంటప్పుడు రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసించాలని ప్రశ్నించారు.
అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కన పెట్టేశాయి. నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విషయాలు బయటకు వస్తున్నాయి. అలాంటప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా నమ్మగలం? అక్కడ్నుంచి ఆ ఓటరే ఓటు వేస్తున్నాడా? వేరేవరైనా వేస్తున్నారో తెలుసుకోవడం ఎలా? అంటూ వినోద్ కుమార్ ప్రశ్నలు సంధించారు.
బీఆర్ఎస్ తోపాటు దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాగా, ఇప్పటికే ఈ విధానంపై టీడీపీ సానుకూలంగా స్పందించడం గమనార్హం. రిమోట్ ఓటింగ్ విధానంతో ఓటు వేయాలని ఉండి వేరే ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications