పదేళ్ల మీ దోపిడీ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు: సీఎం రేవంత్
పరిగి మండలం నారాయణపూర్ గ్రామ శివారులో ఫిబ్రవరి 7 శనివారం నిర్వహించిన ప్రజాపాలన- ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీష్, కేటీఆర్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని.. ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు. పదేళ్ల మీ దోపిడీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
"శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ నుంచి ఊర్లమీదకు మారీచుడు, సుబాహును పంపించాడు. వాళ్లు మేం చేసే అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారు. కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నానని నన్ను హరీష్, కెటీఆర్ విమర్శిస్తున్నారు.
"కేసీఆర్ దొంగ పాస్ పోర్టుల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా..? కేసీఆర్ పై దొంగనోట్ల కేసు నమోదు అయిందని మీ పక్కనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పాడు.. మీ దొంగనోట్ల చరిత్ర నేను చెరిపేస్తే చెరిగేదా..? దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ దొంగహామీల చరిత్ర నేను చెరిపితే పోతుందా..? పదేళ్ల మీ దోపిడీ చరిత్రను ఎవ్వరూ చెరిపేయలేరు..?" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం మీ పాపాల భైరవుడి చరిత్ర చెరిగిపోదని కీలక ఆరోపణలు చేశారు. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బయటికి తీసుకు వస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 6650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు.












Click it and Unblock the Notifications