మోడీకి షాక్: దత్తాత్రేయ-స్మృతిల రిజైన్‌కు డిమాండ్: వర్సిటీలో రోహిత్ స్థూపం!
హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను వెంటనే బర్తరఫ్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రోహిత్ ఆత్మహత్య కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే.
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మధ్యాహ్నం హెచ్‌సియుకు రానున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్థుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
అప్పారావును తొలగించాలి: విహెచ్
రోహిత్ ఆత్మహత్యకు కారణమైన విసి అప్పారావును వెంటనే తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ వి హనుమంత రావు మంగళవారం డిమాండ్ చేశారు. ఆయన హెచ్‌సియులో పర్యటించారు. ఘటనతో సంబందమున్న దత్తాత్రేయతో పాటు మిగతా వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
నలుగురు విద్యార్థుల పైన వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ఫెలోషిప్ పునరుద్ధరించాలన్నారు. అధికారుల తీరు వల్లే విశ్వవిద్యాలయంలో అలజడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రోహిత్ కుటుంబానికిపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చోటు చేసుకుందని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

విచారిస్తున్న ద్విసభ్య కమిటీ
రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రం నిజనిర్ధారణ బృందాన్ని నియమించింది. మంత్రిత్వశాఖలో ప్రత్యేక విధుల అధికారి షకీలా టి శంషు, ఉపకార్యదర్శి స్థాయి అధికారి సూరత్ సింగ్‌లతో కూడిన ద్విసభ్య సంఘం సోమవారం హైదరాబాద్‌కు వచ్చింది.
కేంద్ర నిజనిర్ధారణ కమిటీ విద్యార్థులను విచారిస్తోంది. అలాగే వర్సిటీ అధికారులను కూడా విచారిస్తోంది. తెరాస ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కలిశారు.
హెచ్‌సీయూలో రోహిత్ స్మారక స్థూపం!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల స్మారకస్థూపం నిర్మాణం జరగనుందని తెలుస్తోంది. వర్సిటీలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రోహిత్ స్మారకస్థూపాన్ని విద్యార్థులు నిర్మించనున్నారు. మరోవైపు వర్సిటీ పాలనా భవనం వద్ద విద్యార్థులు ధర్నా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications