సీమాంధ్రుల్ని తిట్టిన నోటనే పొగడ్తలా: కేసీఆర్‌పై షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకప్పుడు సీమాంధ్రులను తిట్టిపోసిన కేసీఆర్.... ఇప్పుడు వారి కాలికి ముల్లు అంటుకుంటే నోటితో తీస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని ఫాసిస్ట్ అన్న కేసీఆర్... ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పైన కక్ష కట్టారన్నారు.

విశ్వవిద్యాలయ సమస్యల పైన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. వర్సిటీల సమస్యలను పరిష్కరించేందుకు కేసీఆర్ ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. వర్సిటీలు నాశనమవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రొఫెసర్లు ఈ సమస్యపై స్పందించాలన్నారు.
రాష్ట్రంలోని ఏడువర్శిటీలకు వీసీలు లేరన్నారు. ఉస్మానియా యూనివర్శిటీకి ఎనిమిది నెలలుగా వీసీని నియమించలేదన్నారు. యూనివర్శిటీల నిర్వహణకు రూ. 350 కోట్లు ప్రభుత్వాన్ని అడిగితే, బడ్జెట్‌లో కేవలంలో రూ.180 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ప్రభుత్వం వెంటనే యూనివర్శిటీలకు వీసీలను నియమించాలన్నారు. పూటకోమాట మాట్లాడటం కేసీఆర్ నైజమన్నారు.
కాగా, హుస్సేన్ సాగర్‌కు బదులు ఇందిరా పార్క్ వద్ద వినాయక సాగర్ అంటే తాము ఊరుకునేది లేదని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు పోవద్దన్నారు. వినాయక సాగర్ అంటే ప్రతిఘటిస్తామని చెప్పారు. ఈ అంశం పైన కేసీఆర్ అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications