శ్మశానమే చివరి మజిలీ: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల బలవన్మరణం
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో దారుణం జరిగింది. శ్మశానంలోని చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల జంట బలవన్మరణం చేసుకుంది. డిచ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం సిరికొండ మండలం రావుట్ల గామ్రానికి సాయిరాం(19), డిచ్‌పల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన అజ్జం శిరీష (17) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
అంతేకాదు శిరీష, సాయిరాంలు వరుసకు బావమరదళ్లు అవుతారని, శిరీషకు వివాహం చేయడానికి ఇంట్లో సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిన సాయిరాం తాను శిరీష ప్రేమించుకుంటున్నామని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కాగా శిరీష వయస్సు 17 సంవత్సరాలు కావడంతో మేజర్ కావడానికి మరో ఏడాది అవసరమని చెప్పారు.
దీంతో కలిసి ఉండలేక, విడిచి బతకలేక ఆత్మహత్యే శరణ్యమని ఒకే చెట్టుకు ఉరివేసుకుని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో సాయిరాం శిరీషకు తాడుతో ఉరివేసి తానుకూడా అదే చెట్టుకు ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు ముందురోజు అంటే సోమవారం రాత్రే శిరీషను కొత్తపేట నుంచి సాయిరాం తన బైక్‌పై ఎక్కించుకొని వచ్చాడు. నర్సింగపూర్ లో హనుమాన్ ఆలయం వద్ద భక్తులు భజనలు చేస్తుండగా వారిని చూసి మోటార్ సైకిల్‌ను అక్కడే వదిలేసి మిట్టాపల్లి బైపాస్ నుంచి నడుచుకుంటూ కమలాపూర్ శ్మశాన వాటికకు చేరుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నరేందర్ రెడ్డిలు మృతదేమాలకు పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది.
కాగా, డిచ్‌పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అజ్జం శిరీష సీఈసీ రెండవ సంవత్సరం చదువుతుంది. పరీక్షలకు సంబంధంచిన హాల్‌టికెట్ తీసుకెళ్లిన 24 గంటల్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో సహచర విద్యార్థినులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
అందరితో కలిసిమెలిసి ఉండే శిరీష చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ విఫలమవుతుందనే కారణంతో ఆత్మహత్య చేసుకోవడంతో కొత్తపేట్ గ్రామంలో విషాదం నెలకొంది. ఒకే ఒక కూతురైన శిరీషను అల్లారుముద్దుగా పెంచారు. మరో ఏడాదిలో పెళ్లి చేద్దామనుకున్న తమ కలలు కన్నీలయ్యాయంటూ కుటుంబ సభ్యుల రోదించారు.
తాము ఎవరికోసం బతకాలి.. ఎందుకోసం బతకాలి అంటూ శిరీష కుటుంబ సభ్యులు గుండెలవిసేలా చేసిన రోదనలు గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించాయి. అదే విధంగా చేతికొచ్చిన కొడుకు సాయిరాం, చేతికొచ్చిన శిరీషలు నిన్నటి వరకు ప్రాణాలతో ఉండి ప్రస్తుతం విగత జీవులై పడి ఉండడం గ్రామస్థులను కలచివేసింది.
మరోవైపు కమలాపూర్ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటికలోనే వారు చెట్టుకు ఉరివేసుకొని అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కమలాపూర్ వాసులు కన్నీరు పెట్టుకున్నారు. శ్మశాన వాటికలోనే వారిద్దరి చివరి క్షణాలు ముగియడం అందరినీ బాధించింది.












Click it and Unblock the Notifications