కాంగ్రెస్ దరిద్రానికి కారణం కిరణ్ రెడ్డి సీఎం కావడమే: విహెచ్ ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: కార్తీ చిదంబరం వల్లే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన సీఎం అయిన తర్వాతే కాంగ్రెస్‌కు దరిద్రం పట్టుకుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు అన్నారు.
మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వల్లే కిరణ్ రెడ్డికి సీఎం కుర్చీ దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంట్‌లో కార్తీ చిదంబరం అంశం దద్దరిల్లిన సంగతి తెలిసిందే.
కార్తీ చిదంబరం అక్రమ మార్గాల ద్వారా వేలాది కోట్లు సంపాదించారని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను అన్నాడీఎంకే ఎంపీలు స్థంభింపజేశారు. రెండు సభలు ప్రారంభమైన వెంటనే వీరు వెల్‌లోకి దూసుకెళ్లి, ఎయిర్ టెల్-మ్యాక్సిస్ డీల్‌లో నిందితుడైన కార్తీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల ఆయన నివాసంలో సోదాలు జరిపినప్పుడు ఆయన 14 దేశాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చిందంటూ ఒక ఆంగ్ల దినిపత్రిక ప్రచురించిన కథనాన్ని చూపారు. నిబంధన మేరకు నోటీసులు ఇచ్చి అనుమతి పొందితే ఏ విషయంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య చెప్పినా వారు వినిపించుకోలేదు.
ఈ నేపథ్యంలో విహెచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల ఎయిర్ టెల్-మ్యాక్సిస్ ఒప్పందానికి సంబంధించి కార్తీ చిదంబరంపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన అంశాన్ని కూడా ప్రస్తావించిన విహెచ్... కార్తీకి కిరణ్ రెడ్డి మిత్రుడని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ, ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి పాలైంది. కాంగ్రెస్‌కు ఆశించిన ఆదరణ లభించలేదు.
దీంతో ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ లేనంత దుస్థితికి దిగజారింది. అయితే ఈ పరిస్థితికి రాష్ట్ర విభజన ఏమాత్రం కారణం కాదని విహెచ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications