పెళ్లికి రూ.2.50 లక్షలు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి: ఈఎంఐపై తీపి కబురు
పెళ్లిళ్లపై ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెళ్లిళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.2.50 లక్షలు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరించింది.
న్యూఢిల్లీ: పెళ్లిళ్లపై ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెళ్లిళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ.2.50 లక్షలు తీసుకునేందుకు ఆర్బీఐ అంగీకరించింది. ఇందుకు సంబంధించి బ్యాంకులకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది.
పెళ్లిళ్లకు రూ.2.5 లక్షలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. డబ్బులు తీసుకునే వారు.. కేటరింగ్, మండపాల ఖర్చులకు ఆధారాలు చూపించాలి. పెళ్లి ఖర్చులకే వాడుతున్నామని అఫిడవిట్ ఇవ్వాలి. పెళ్లిళ్లకు ఇచ్చే మొత్తం పైన బ్యాంకులకు రికార్డులను చూపించాలి. తల్లిదండ్రులు లేదా వరుడు, వధువు మాత్రమే డబ్బులు విత్ డ్రా చేయాలి. డిసెంబర్ 30 వరకు పెళ్లిళ్లకు మాత్రమే ఈ నిబంధనలు.

షరతులు
బ్యాంక్ అకౌంట్ లేని వారికి డబ్బులు చెల్లించేందుకు మాత్రమే విత్ డ్రా చేయాలి. అలాగే, ఆ డబ్బులు ఎవరెవరికి ఇస్తున్నారో ఆ పేర్లు పేర్కొనాలి. వారికి అకౌంట్లు లేకుండా ఉండాలి.
డబ్బులు తీసుకోవాలనుకుంటే వరుడు, వధువు పేరు, వారి ఐడెంటిటీ ప్రూఫ్స్, అడ్రెస్ ప్రూఫ్, పెళ్లి తేదీకి సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వారి.
పెళ్లి జరిగే తేదీ డిసెంబర్ 30 2016లోపు అయితేనే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎక్కువలో ఎక్కువగా రూ.2.50 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రధాని మోడీ రద్దు ప్రకటన చేసిన నవంబర్ 8, 2016 నుంచి క్రెడిట్ అయిన డబ్బులు తీసుకోవచ్చు.
వరుడు, వధువు లేదా కుటుంబ సభ్యులు విత్ డ్రా చేయవచ్చు.
ఈఎంఐ కట్టే వారికి తీపి కబురు
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) పెద్ద ఊరట నిచ్చింది. రూ.కోటి లోపు వ్యవసాయ, వ్యాపార, పర్సనల్, హోం లోన్లు తీసుకున్న వారు నెల వారీ కట్టాల్సిన వాయిదా మొత్తాలను కట్టేందుకు రెండు నెలల పాటు వెసులుబాటు కల్పించింది.
ఈఎంఐలు కట్టేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది తీపివార్త. అరవై రోజుల తర్వాత కట్టినా ఎలాంటి రుసుము వసూలు చేయరు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల వద్ద భారీ క్యూలు ఉండటం వల్ల లోన్‌లు తీసుకున్న వారు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్బీఐ తాజా ప్రకటన విడుదలైంది.
బ్యాంకు డిపాజిట్లపై ప్రకటన
ప్రధాని మోడీ సంచలన నిర్ణయం ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడిపై భారతీయ రిజర్వు బ్యాంకు సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. నవంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు దేశంలో మొత్తం రూ.5,44,571 కోట్లు డిపాజిట్లుగా వచ్చాయని పేర్కొంది.
అందులో రూ.5,11,565 కోట్లు ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని ఆర్బీఐ పేర్కొంది. మరో 33,006 కోట్లు నగదుమార్పిడి జరిగిందని తెలిపింది. ఏటీఎంలు, బ్యాంకుల నుంచి 1,03,316 కోట్లు విత్ డ్రా అయినట్లు ఆర్బీఐ నివేదికలో పేర్కొంది.












Click it and Unblock the Notifications