ఉద్యమంలో కాళ్లు, చేయి పోయాయి: సిఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి కలకలం చెలరేగింది. నల్గొండ జిల్లా రాయినిగూడెంకు చెందిన పిడమర్తి నాగరాజు (24) బుధవారం రాత్రిపూట తొమ్మిద గంటలకు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
ఆయన ఆత్మహత్యకు పాల్పడటాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో నాగరాజు మిర్యాలగూడలో రైల్ రోకోలో పాల్గొని రెండు కాళ్లు, ఒక చేతిని కోల్పోయాడు.
తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసేందుకు పలుమార్లు వచ్చినా ముందస్తు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ముందస్తు అనుమతి లేకపోవడంతో సిఎంను కలవలేకనీయలేదు. ఎన్నిసార్లు వెళ్లినా అనుమతి దొరకడం లేదని మనస్తాపానికి గురై నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు.

కెసిఆర్ పైన జానారెడ్డి నిప్పులు
వరంగల్ జిల్లాలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భిన్నంగా కనిపించారు. సాధారణంగా సీఎల్పీ నేత హోదాలో వేదికపై కూర్చోవాల్సిన ఆయన అందుకు భిన్నంగా కార్యకర్తల మధ్యే కూర్చుండిపోయారు.
వేదిక పైకి రావాలని నేతలు బలవంతం చెప్పినా.. తాను కార్యకర్తల్లోనే ఉంటానని, మీరంతా మాట్లాడితే వింటానని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత సమావేశం జరుగుతుండగానే సెక్యూరిటీ సిబ్బంది చేత భగవద్గీత తెప్పించుకున్న ఆయన దాదాపు అరగంట పాటు అందులో లీనమయ్యారు.
మరోవైపు జానారెడ్డి... మొన్నటి అసెంబ్లీ సమావేశాల దాకా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాస్తంత మెతక వైఖరి అవలంబించారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ఆయన తన పంథా మార్చుకున్నారు. వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
నేరుగా సీఎం కేసీఆర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన మాటల తూటాలను పేల్చారు. ఉద్యమ నేతగా ఎదిగిన సీఎం కేసీఆర్‌కు పాలనా సామర్థం లేదన్నారు. కేసీఆర్ కారణంగా అభివృద్ధిలో తెలంగాణ పదేళ్లు వెనక్కెళ్లిపోయిందన్నారు. పనికి రాని మాటలతో కాలయాపన చేస్తూ పాలనను అపహాస్యం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications