తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్ జగన్ విన్నింగ్ ఫార్ములా.. కాలు బయటపెట్టకుండా
తిరుపతి: రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏమిటో మరోసారి తేటతెల్లమైంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు.. వైఎస్సార్సీపీకి ఉన్న పట్టును నిరూపించాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వైసీపీకి పట్టం కట్టాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోల్చుకుంటే.. పట్టణ స్థానిక సంస్థల్లో వైసీపీ బలం మరింత పెరిగిందనేది స్పష్టమైంది. 85 శాతానికి పైగా పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకోగా.. మున్సిపల్ ఫలితాల్లో ఆ సంఖ్య 90 ప్లస్సే. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థలను క్లీన్ స్వీప్ చేసింది.

ఆధిపత్యాన్ని చలయించలేక.. చతికిల
హోరాహోరీగా సాగుతుందనుకున్న మున్సిపల్ పోరు.. పూర్తిగా ఏకపక్షమైంది. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన కూటమి అడ్రస్ గల్లంతయింది. కనీస పోరాటం చేయలేక చేతులెత్తేశాయి. అమరావతి ఉద్యమానికి గుండెకాయగా భావించే గుంటూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు.. తెలుగుదేశానికి గట్టి పట్టు ఉన్నగ్రేటర్ విశాఖపైనా వైసీపీ జెండా ఎగురవేయడమంటే మాటలు కాదు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీకి నలుగురు శాసనసభ్యులను అందించిన విశాఖలో ఆ పార్టీ గట్టిపోటీ ఇవ్వగలిగిందే తప్ప ఆధిపత్యాన్ని చలాయించలేకపోయింది.

కాలు బయటపెట్టకుండా..
ఈ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..కాలు బయటపెట్టలేదు. ప్రచారానికి రాలేదు. కనీసం ఓ ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. తమ పార్టీకి ఓటు వేయాలని అడగనూ లేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను పార్టీ నాయకులపైనే ఉంచారు. అదే సమయంలో టీడీపీ తరఫున ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలుల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ సైతం రోడ్ షోలను నిర్వహించారు.

పార్టీ నేతలపైనే ప్రచార బాధ్యతలు..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయసాయి రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. గుంటూరు, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలు, ఒంగోలు, విజయనగరం, ఏలూరు, నెల్లూరు, అనంతపురం వంటి చోట్ల ప్రచార బాధ్యతలను ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే తీసుకున్నారు. వైఎస్ జగన్ ఎంట్రీ ఇవ్వనప్పటికీ.. వైసీపీ గరిష్ఠ స్థాయిలో 90 శాతానికి పైగా విజయాలను అందుకోగలిగింది.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికీ
ఇదే ఫార్ములాను తిరుపతి ఉప ఎన్నికలోనూ అనుసరించే అవకాశాలు లేకపోలేదు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వైఎస్ జగన్ రాకపోవచ్చని చెబుతున్నారు. వైఎస్ జగన్‌ను చూసి కాకుండా.. ఆయన పరిపాలన తీరును ఆధారంగా చేసుకుని ప్రజలు తమ పార్టీకి ఓటు వేస్తారని ఆత్మవిశ్వాసం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటినట్టు కనిపిస్తే తప్ప తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వైఎస్ జగన్ రాకపోవచ్చని సమాచారం. ఈ ఎన్నిక ప్రచార బాధ్యతలను మంత్రులు, పార్టీ నాయకుల మీదే వదిలేస్తారని అంటున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను వైసీపీ గెలుచుకున్న పరిస్థితుల్లో అదే ఊపును లోక్‌సభ ఉప ఎన్నికలో ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది.