పెంబర్తి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం: చిన్నారి సహా ముగ్గురు మృతి
జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది.
వరంగల్: జనగామ జిల్లా పెంబర్తి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్‌తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది.
కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం వాహనం పంక్షర్ కావడంతో టైరు మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనను గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. తిరుపతి నుంచి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రుల వద్ద మృతులు, క్షతగాత్రుల కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి.












Click it and Unblock the Notifications