తెలంగాణ ఎన్నారైల బ్లాక్ డే
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఈ నెల 1వ తేదీని అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు బ్లాక్ డేగా పాటించారు. వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయం ముందు తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనకు దిగారు. నవంబర్ 1వ తేదీని వారు తెలంగాణ విద్రోహ దినంగా పరిగణించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో నిజాం నవాబు పాలన నుంచి విముక్తి చెందిన తెలంగాణ ప్రజల కలలను కాలరాసిందని వారు విమర్శించారు. మాసాచుసెట్స్, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ మేరీల్యాండ్, వర్జినీయా, నార్త్ కరోలినా వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్ారు. తెలంగాణ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు 40 మంది రాయబార కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు.
తెనా చైర్మన్ రవి మేరెడ్డి భారత రాయబారి రోనెన్ సేన్ కు డిమాండ్ లేఖను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ను తీర్చడానికి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని ఆయన కోరారు. కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి)లో, రాష్ట్రపతి ప్రసంగంలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కూడా చేర్చిన విషయాన్ని తెనా తన వినతిపత్రంలో గుర్తు చేసింది. యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి నాలుగేళ్లు గడిచినా తన హామీని నెరవేర్చలేదని విమర్శించింది. బిజెపి, తెలుగుదేశం, బిఎస్పీ, సిపిఐ వంటి ప్రధాన పార్టీలు అనుకూలంగా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆ వినతిపత్రంలో విమర్శించారు. తమ మనోభావాలను ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారని తెలియజేశారు. రాయబారి తరఫున రాహుల్ మల్హోత్రా డిమాండ్ లేఖను స్వీకరించారు.
తెలంగాణ ఎన్నారైల నిరసన కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగింది. ప్రవాస తెలంగాణవాసులు తెలంగాణ ప్రజలతో ఉన్నారని ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారికి తెనా కృతజ్ఞతలు తెలియజేసింది.












Click it and Unblock the Notifications