పేద విద్యార్థులకు ఎన్నారైల నోట్ బుక్స్
తెలంగాణ ఎన్నారై ఫోరం (తెనా) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ జరిగింది. నాణ్యమైన విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు గంప వేణుగోపాల్, వెంకట్ పబ్బతి, శ్రీధర్ బిత్తిక, అనిల్ కూర్మాచలం ఓ ప్రకటనలో తెలిపారు.

అక్షరం పేరుతో తెనా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్షరం మిషన్ ద్వారా తమతో సాధ్యమయ్యే సహాయాన్ని పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణలోి మెదక్, వరంగల్ జిల్లాల్లోని ఆరు పాఠశాలల్లో, ఒక జూనియర్ కళాశాలలో ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.
దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ సహకారంతో వరంగల్ రంగశాయిపేట జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ సాంబయ్య, మెదక్ జిల్లా చిన్ని గుండిల్లి పాఠశాలలో ప్రొఫెసర్ ఆదికృష్ణయ్య పాల్గొన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ తమతో ఫోన్ ద్వారా మాట్లాడి హంగుఆర్భాటాలు లేకుండా ప్రతి రూపాయి కూడా సద్వినియోగం చేస్తూ విద్యార్థులకు నేరుగా సహహకరించడం అభినందనీయమని చెప్పారు. తమ వంతు సహాయం పేద విద్యార్థులకు అందించాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెనా ప్రతినిధులు చెప్పారు.












Click it and Unblock the Notifications