తెలంగాణ కథపై స్థూల పరిశీలన

తెలంగాణ ఉద్యమ స్పృహ సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో వ్యక్తం కావడానికి ముందు తెలంగాణలో 1970 నుంచి మాత్రమే కథ వుందనే అభిప్రాయం స్థిరపడిపోయింది.దీన్నే ఓ కొండగుర్తుగా పెట్టుకుని తెలంగాణ సాహిత్య విమర్శకులు తెలంగాణ కథను విశ్లేషిస్తూ వచ్చారు. అది 'తెలంగాణ తోవలు', 'భౌగోళిక తెలంగాణ', 'తెలంగాణ కథ - దేవులాట' పుస్తకాలు వచ్చే వరకు కొనసాగింది.తెలుగు కథా సాహిత్యంలో తెలంగాణ అస్తిత్వాన్ని చూసుకోవాల్సి వచ్చే సరికి దేవులాట ప్రారంభమైంది. తెలంగాణ తొలితరం, మలితరం కథలను సంగిశెట్టి శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డి కఠినమైన శ్రమ చేసి తెచ్చారు. దాంతో తెలంగాణ కథపై అద్భుతమైన వెలుగు ప్రసరించింది. వ్యక్తిగతమైన కథాసంకలనాలు కూడా వెలుగు చూశాయి. కాళోజీ కథలు, గూడూరు సీతారాం వంటివారు కథలు రాశారనే విషయం మొదటిసారి చూసిన తెలంగాణ రచయితలు ఉద్వేగభరితులయ్యారు. తెలంగాణ కథపై ఆ దేవులాట కొనసాగుతూ తెలుగులో తొలి కథ ఏది అనే చర్చకు దారితీసే దాకా అడుగులు వేసింది.
వర్తమాన తెలంగాణ కథపై కూడా వెలుగు ప్రసరించే పని సమాంతరంగా జరుగుతూ వస్తున్నది.తెలంగాణ కథను ప్రోత్సహించే పనులు కూడా ఊపందుకున్నాయి. కర్ర ఎల్లారెడ్డి తెలంగాణ కథావార్షికలు తేవడం అందుకు మంచి ఉదాహరణ. తెలంగాణ కథ బహుముఖంగా విస్తరిస్తూ తెలుగు కథకు తలమానికంగా నిలుస్తుంటే అందుకు తగిన విధంగా తెలంగాణ కథపై విశ్లేషణ, పరామర్శ, విమర్శ విస్తరిస్తూ వస్తున్నది. అందులో భాగంగానే డాక్టర్ చవ్వా వెంకటరెడ్డి తెలంగాణ కథపై విస్తృతమైన అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నాడు.
ఓ క్రమానుగతిలో వెంకటరెడ్డి తొలి నుంచి ఇప్పటి వరకు వచ్చిన తెలంగాణ కథలను పరామర్శించే పనిచేశాడు. పుస్తకాన్ని నాలుగు అధ్యాయాలుగా విభజించాడు. తెలంగాణ కథకు వెళ్లే ముందు తెలంగాణలోని వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేశాడు. విశ్వవిద్యాలయ స్థాయిలో పరిశోధన చేసిన రచయిత కాబట్టి ఆయన తెలంగాణ కథ పరామర్శకు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. అంటే, రచనకు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుని అందుకు అనుగుణంగా రచన చేసుకుంటూ పోయే విధానాన్ని అనుసరించాడు. ఇది ఒక రకంగా సులభం, మరో రకంగా క్లిష్టం. ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ముందస్తు అధ్యయనం చాలా అవసరం. ఇది కష్టమైన పని. దీన్ని తయారు చేసుకున్న తర్వాత అందుకు అనుగుణంగా కథావిశ్లేషణ సాగించాడు వెంకటరెడ్డి. ముందస్తు అధ్యయనం ద్వారా రూపొందించుకున్న ప్రణాళిక తదనంతర విశ్లేషణ కాస్తా సులభంగా సాగుతుంది. అయితే, అందుకు తగిన గ్రంథాలను, వ్యాసాలను సేకరించుకోవాల్సి వుంటుంది. అలాంటి సేకరణ సాహిత్య విద్యార్థి, అధ్యాపకుడు కావడం వల్ల వెంకటరెడ్డి చాలా చేశాడని గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. వెంకటరెడ్డి కృషి భవిష్యత్తు సాహిత్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ కథపై అధ్యయనం చేయాలనుకునేవారికి ఓ రెఫరెన్సు గ్రంథంగా ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని సమగ్రమని చెప్పలేం, ఉన్నంతలో తెలంగాణ కథకు సంబంధించి ఓ సమగ్ర గ్రంథంగా ఇది ముందుకు వస్తున్నది. తెలంగాణ కథా రచయితల జాబితా కూడా చాలా వరకు ఈ గ్రంథం ద్వారా రూపొందించుకోవడానికి వీలవుతుంది.
అయితే, చవ్వా వెంకటరెడ్డి ఈ రచనను నేను పూర్తి స్థాయి విమర్శ గ్రంథంగా పరిగణించడం లేదు. సామగ్రి సేరకరణకు విశేషంగా కృషి చేసిన వెంకటరెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో విమర్శకు పెట్టలేదు. ఓ పరామర్శగా, విశ్లేషణగా తీర్చిదిద్దాడు. ఆయన ఉద్దేశం కూడా అదే అయి వుంటుంది. ముందు పరామర్శ రూపంలో తెలంగాణకథా సాహిత్యాన్ని పాఠకుల ముందు, సాహిత్య విద్యార్థుల ముందు పెడితే దాన్ని విమర్శకు సంబంధించిన వివిధ కోణాలు విస్తరిల్లడానికి అవకాశం వుంటుందని అతను భావించాడని అనిపిస్తున్నది.
తెలంగాణలోని తొలితరం, మలితరం కథా సాహిత్యాన్ని పరిచయం చేసిన తర్వాత వర్తమాన కథా సాహిత్యాన్ని విస్తృత స్థాయిలో వెంకటరెడ్డి ఈ గ్రంథంలో పరామర్శించాడు. ఇంకో మాట కూడా చెప్పాలి. వెంకటరెడ్డి స్థూల పరిశీలన మాత్రమే చేశాడు. సూక్ష్మ పరిశీలనలోకి వెళ్లలేదు. తెలంగాణలో వచ్చిన విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం, బహుజన, ప్రాంతీయ ప్రాతినిధ్య కథలను ఆయన విశ్లేషించాడు. ఈ విభజన సరిపోలేదేమో ఆయనకు రాజకీయ, వృత్తి జీవన, తదితర ఉపశీర్షికల కింద కూడా తెలంగాణ కథ గురించి వివరించాడు. వస్తువైవిధ్యాన్ని ఆయన వివిధ ఉపశీర్షికల కింద పరామర్శించాడు. తెలంగాణ కథ రచనా వైవిధ్యాన్ని కూడా వెంకటరెడ్డి పరామర్శించాడు. అంటే తెలంగాణ కథాశిల్పాన్ని పాఠకులకు వివరించే ప్రయత్నం చేశాడు.
ఇంతకు ముందే చెప్పినట్లు సూక్ష్మ పరిశీలనలోకి వెంకటరెడ్డి వెళ్లలేదు. అది వెంకటరెడ్డి ఎంచుకున్న ప్రణాళికలో లేదని ముందే చెప్పుకున్నాం.అలాంటి సూక్ష్మ పరిశీలనకు అవసరమైన పునాదిని వెంకటరెడ్డి ఏర్పాటు చేసి పెట్టాడు. తెలంగాణ కథకు సంబంధించి అలాంటి పరిశీలనకు అవసరమైన గ్రంథం లేదని గ్రహించి వెంకటరెడ్డి ఆ పనిచేశాడని చెప్పవచ్చు.
- కాసుల ప్రతాపరెడ్డి
(చవ్వా వెంకటరెడ్డి తెలంగాణ కథపై రాసిన గ్రంథానికి ముందుమాట..)












Click it and Unblock the Notifications