పాకిస్తాన్ తో సంబంధాలు తెంచుకున్న స్టార్ క్రికెటర్: ఐపీఎల్ కు లైన్ క్లియర్?
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ తన సొంత దేశంలో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నాడు. సంపూర్ణ బ్రిటీష్ పౌరసత్వాన్ని పొందాడు. ఇకపై దీంతో పాకిస్తాన్ జట్టు తరఫున ఆడే అవకాశాలకు శాశ్వతంగా తెరపడింది. బ్రిటీష్ పౌరసత్వం లభించిన కొద్ది నెలలకే.. తాను ఇకపై పాకిస్తాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. బ్రిటన్ నిబంధనల ప్రకారం అక్కడ స్థానిక ఆటగాడిగా గుర్తింపు పొందిన తర్వాత మరో దేశానికి ఆడటం సాధ్యం కాదని వెల్లడించాడు. దీంతో పాక్ క్రికెట్ బోర్డుతో అతనికి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టయింది.
అతనే.. మహ్మద్ అమీర్. స్టార్ ఫాస్ట్ బౌలర్. ఆయన భార్య నర్గిస్ ఖాన్.. బ్రిటన్ దేశస్తురాలు. ఆమె ద్వారా ఆ దేశ పౌరసత్వాన్ని పొందాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ది హండ్రెడ్ టోర్నమెంట్లో బ్రిటన్ క్రికెటర్ గా అరంగేట్రం కూడా చేశాడు. యూకే కౌంటీ ఛాంపియన్షిప్, ది హండ్రెడ్ వంటి డొమెస్టిక్ లీగ్‌లలో కొనసాగాలంటే అక్కడి ఫ్రాంఛైజీలతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. స్థానిక హోదా పొందిన ఆటగాళ్లు ఇతర దేశాల తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకూడదు.

ఈ నిబంధనల వల్లే పాకిస్థాన్ చాప్టర్‌ను తాను ముగించాల్సి వచ్చిందని అమీర్ తాజాగా వివరించాడు. బ్రిటీష్ పౌరసత్వం రావడంతో మహ్మద్ అమీర్ ఐపీఎల్ లో అడుగుపెడతాడా లేదా అనే చర్చ మొదలైంది. గతంలో పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఆల్ రౌండర్ అజహర్ మహమూద్ కూడా బ్రిటీష్ పౌరసత్వం పొందిన తర్వాతే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ లో ఆడటంపై అమీర్ స్పందించాడు. ఇందులో ఆడటంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. 2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీలో మాత్రం ఓ విదేశీ క్రికెటర్‌గా బరిలోకి దిగడం ఖాయమని స్పష్టం చేశాడు. దీనికోసం తన పేరును నమోదు చేసుకోనున్నట్లు వివరించాడు.
పీఎస్ఎల్ లో ఆడిన అనుభవం ఉందని, పాకిస్తాన్ జెర్సీని మళ్లీ ధరించే అవకాశం లేకపోయినా, ఆ దేశ గడ్డపై ఆడే అవకాశం వస్తే వదులుకోబోననీ అతను వ్యాఖ్యానించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా పేరొందిన మహ్మద్ అమీర్ 2024 జూన్‌లో టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. బ్రిటన్ లో ట్రెంట్ రాకెట్స్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు.













Click it and Unblock the Notifications