సంచలనాలకు తెర తీసిన వినేష్ ఫొగట్
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. సంచలనాలకు తెర తీశారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోన్నారు. రెజ్లింగ్ రింగ్ నుంచి ఎన్నికల బరిలో దిగబోతోన్నారు. సహచర రెజ్లర్ బజరంగ్ పునియాతో కలిసి రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.
తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.
ఈ పరిస్థితుల మధ్య ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోండటం సంచలనం రేపుతోంది. బజరంగ్ పునియాతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు. అనంతరం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు.
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయడం లాంఛనప్రాయమే. ఇప్పటికే 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో వారిద్దరి పేర్లు లేవు. కాంగ్రెస్‌లో అధికారికంగా చేరితే మలి విడత జాబితాలో వాళ్లకు టికెట్ ఖరారు కావొచ్చు.
ఇటీవలే ఆమె ఉత్తరాది రైతుల ఆందోళనల్లోనూ పాల్గొన్న విషయం తెలిసిందే. శంభు బోర్డర్ వద్ద రైతుల ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. వారిని యోధులుగా కీర్తించారు. పూలమాలలతో సన్మానించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని, ఆ వెంటనే కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కావడం.. రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే ప్రచారానికి కేంద్రబిందువు అయింది.












Click it and Unblock the Notifications