జగన్ ఎఫెక్ట్: బాబు ఆలోచన

శాసనసభలో తెలుగుదేశం శాసనసభ్యులు 90 మంది ఉన్నారు. వారిలో 30 మంది చీలి ప్రత్యేక గ్రూప్ గా ఏర్పడినా చంద్రబాబుకు కష్టమే అవుతుంది. ఇటు జగన్, అటు కాంగ్రెసు ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి చీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం కూలిపోయి, మధ్యంతర ఎన్నికలు వస్తే మంచిదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీలో అనైక్యత, ప్రభుత్వంపై వివిధ వర్గాల అసంతృప్తి మధ్యంతర ఎన్నికలు వస్తే తమ పార్టీకి కలిసి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ కు పార్టీ పెట్టి సంస్థాగత నిర్మాణం చేసుకోవడానికి తగిన వ్యవధి కూడా ఉండదని, ఇది తమకు కలిసి వస్తుందని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
శాసనసభ సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. వైయస్ జగన్ రాజకీయాలకు శాసనసభ సమావేశాలు వేదికగా మారినా ఆశ్చర్యం లేదు. కాంగ్రెసులోని తన శాసనసభ్యులను, తెలుగుదేశం శాసనసభ్యులను కొంత మందిని, ప్రజారాజ్యం నుంచి కొద్ది మందిని చీల్చి వైయస్ జగన్ రోశయ్య ప్రభుత్వానికి ఎసరు పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే, కాంగ్రెసు అధిష్టానం రోశయ్య ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ, మజ్లీస్ పార్టీలతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా రోశయ్య ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ముందుకు రావచ్చునని అంటున్నారు. రోశయ్య ప్రభుత్వం నిలదొక్కుకుంటే చంద్రబాబుకు సమస్య అవుతుంది. శాసనసభ్యులను కాపాడుకోవడం కష్టంగా మారుతుందని అంటున్నారు. అందుకే ఆయన మధ్యంతర ఎన్నికలను కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications