వివేకా సెంటిమెంట్ వ్యూహం

ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా మంత్రి పదవిని పట్టుకుని వేళ్లాడుతున్నారనే విమర్శ నుంచి తప్పుకోవడానికి ఆయన రాజీనామా చేసినట్లు కనిపిస్తోంది. వివేకానంద రెడ్డి రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించకపోవడంతో ఇతరేతర వ్యాఖ్యలు వస్తున్నాయి. పులివెందులలో ఓడిపోతే వైయస్ వివేకానంద రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మండలికి పంపిస్తారని, అందుకే ఇప్పటి వరకు గవర్నర్ కోటా కింది ఎమ్మెల్సీ సీట్లను భర్తీ చేయలేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు విమర్శించారు. ఇదే వాదనను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గం నాయకులు కూడా చేస్తున్నారు.
తనకు ఎమ్మెల్సీగా ఎంపికయ్యే అవకాశాలున్నాయనే వాదన బలంగా ముందుకు వస్తే పులివెందుల ప్రజలు తనకు ఓటు వేయకపోవచ్చునని, ఎలాగూ మంత్రిగా కొనసాగే అవకాశం తనకు ఉందని ప్రజలు భావించి విజయమ్మకు ఓటేసి గెలిపించే అవకాశాలున్నాయని వివేకానంద రెడ్డి భావిస్తున్నారు. దీంతో మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకునే పనిలో పడ్డారు. శాసనసభ్యుడిగా తనను ఎన్నుకుంటేనే మంత్రి పదవి చేపడతానని, లేకుంటే పదవికి దూరంగా ఉంటానని వివేకానంద రెడ్డి ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు సాగించాలని అనుకుంటున్నారు. తనను గెలిపిస్తేనే వైయస్సార్ పథకాలు ముందుకు సాగితాయని ఆయన చెప్పే అవకాశాలున్నాయి.
అయితే, వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధంగా లేరు. ఇప్పుడు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. వివేకానంద రెడ్డి రాజీనామాను ఆమోదిస్తే రాజీనామా చేయాలనే ఒత్తిడి లోకసభ సీటుకు పోటీ పడుతున్న డిఎల్ రవీంద్రా రెడ్డిపై పెరగవచ్చు. ఇది మరో కొత్త సమస్యకు దారి తీయవచ్చు.