జగన్‌పై ఈడి: భిన్న వాదనలు, 2సార్లు చిద్దూనే

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల కుట్ర కారణంగానే ఈడి జగన్ ఆస్తులను జప్తు చేసిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి లేఖ రాసిన వెంటనే చర్యలు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమని వారు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం టిడిపి ఎంపీలు చిదంబరాన్ని కలిసిన వెంటనే ఈడి నోటీసులు వచ్చాయని వారు విమర్శించారు. టిడిపి, కాంగ్రెసుల కుమ్మక్కుకు ఇంతకన్నా నిదర్శనమేం కావాలని వారు ప్రశ్నించారు.
శుక్రవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన సుప్రీం కోర్టులో విచారణ జరగనుందని, దానిని ప్రభావితం చేసేందుకే ఇలా చేసి ఉంటారని విమర్శించారు. రూ.21.5 కోట్ల లబ్ధికి ఎవరైనా 29.50 కోట్ల పెట్టుబడులు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారా అని వారు ప్రశ్నించారు. జగన్‌ను జైలులో ఉంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు యాత్రలు చేస్తున్నారని, జగన్ బయటకు వస్తే ఇబ్బంది అని వారు భావిస్తున్నారన్నారు.
గురువారం టిడిపి ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను కలిసి అవినీతిని ప్రోత్సహించవద్దని చంద్రబాబు రాసిన లేఖను ఇచ్చారు. టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు, కె నారాయణ, వేణుగోపాల్ రెడ్డి, సిఎం రమేష్, గుండు సుధారణి, రమేష్ రాథోడ్‌లు చిదంబరంతో పాటు షిండేలను కలిసి ఈ లేఖను ఇచ్చారు. జగన్‌కు కేంద్రం సహకరిస్తోందని, అందువల్లే ఆయన కేసుల విచారణల్లో జాప్యం జరుగుతోందని, ఆ జాప్యాన్ని నివారించాలని, స్వతంత్ర సంస్థల దర్యాప్తు పారదర్శకంగా జరగాలని నామా డిమాండ్ చేశారు.
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీక్రెట్‌గా ఆయనను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నుండి జగన్ పైన సిబిఐ దూకుడుగా వ్యవహరించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆరోపించారు. చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలోనే సిబిఐ జగన్ ఆస్తులపై కొరడా ఝులిపించింది. ఇప్పుడు టిడిపి ఎంపీలు కలువగానే ఈడి జప్తు చేసిందని విజయమ్మ, షర్మిలలు ఆరోపిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీనిని కుట్రగానే భావిస్తున్నారట.
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుందని, దీనిని గమనించిన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుట్ర పూరితంగా వ్యవహరించి బాబు పాదయాత్రపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేలా చేసేందుకే ఈ కుట్రకు తెర తీశారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. జగన్‌కు, కాంగ్రెసుకు మధ్య ఎప్పుడో ఒప్పందం కుదిరిపోయిందని, ఇవన్నీ నాటకాలు మాత్రమేనని, చివరకు కాంగ్రెసు సహాయంతోనే జగన్ బయటకు రాక తప్పదని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications