హైదరాబాద్: కేంద్ర పాలిత ప్రాంతంగా వెనక్కి
హైదరాబాద్: విభజనలో భాగంగా హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో కేంద్ర ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రాన్ని విభజించాలనే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మొదటి దశ పూర్తయిందని శనివారంనాడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. కాగా, తెలంగాణపై కేబినెట్ నోట్ కూడా తయారైందని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చూసిన తర్వాత దాన్ని న్యాయశాఖ పరిశీలనకు పంపుతారని అంటున్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన లేదని, అయితే హైదరాబాద్ విషయంలో రెండు మూడు ప్రతిపాదనలు ఉన్నాయని షిండే చెప్పారు.

కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి కె. జానా రెడ్డి, పిసిసి సమన్వయ కమిటీ సభ్యుడు షబ్బీర్ అలీ తదితరులు హైదరాబాద్ విషయంపై ఆంటోనీ కమిటీకి నివేదించారు. మిగతా అధిష్టానం పెద్దలకు కూడా తమ వాదన వినిపించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయకూడదని వారు కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ఆలోచనను మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సహా హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు కూడా వ్యతిరేకించారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను సిడబ్ల్యుసి తీర్మానంలో పెట్టనప్పుడు కేబినెట్ నోట్‌లో ఎలా పెడతారని ఎకె ఆంటోనీ, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను అడిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సీమాంధ్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర మంత్రులు కొంత మంది చెప్పగా, మరి కొంత మంది వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలోనూ హైదరాబాద్ విషయంలోనూ సీమాంధ్ర మంత్రుల్లో విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనే విషయంపై తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications