కిరణ్ రెడ్డి సీక్రెట్ రిపోర్టు: తెలంగాణకు నో

Kiran kumar Reddy
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు అధిష్టానం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం విడిపోకుండా చూడాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే తలెత్తే సమస్యలను, ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ ఆయన ఓ సుదీర్ఘ నివేదికను రూపొందించి కాంగ్రెసు అధిష్టానికి సమర్పించేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

జైపూర్‌లో మూడురోజుల పాటు జరిగే చింతన్ శిబిర్‌లో పాల్గొనేందుకు గురువారం రాత్రి బయలుదేరిన ముఖ్యమంత్రి తనవెంట నివేదికనూ తీసుకువెళ్ళినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకుముందే ముఖ్యమంత్రి ఒక నోట్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేసినట్టు తెలిసింది. దాన్నే మరింత వివరంగా మరో నివేదికగా రూపొందించి వెంట తీసుకువెళ్ళినట్టు చెబుతున్నారు.
జైపూర్‌లో జరుగుతున్న చింతక్ శిబిర్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా ఇతర పెద్దలంతా అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోర్ కమిటీ సభ్యుల్ని వీలునుబట్టి కలిసి రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని వివరించి నివేదిక ప్రతిని అందజేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రం, రాయల తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ వంటి ప్రతిపాదనలన్నిటినీ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంతంలో జల వనరులు, విద్యుత్, పరిశ్రమలతోపాటు ఉద్యోగాల విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని ముఖ్యమంత్రి ఆ నివేదికలో తెలిపినట్లు సమాచారం. ప్రధానంగా రాజధాని ఏర్పాటు అన్నది పరిష్కారం లభించని సమస్యగా మారుతుందని ఆయన భావిస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే పక్షంలో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతం వారు, ఉత్తరాంధ్ర ప్రాంతం వారు డిమాండ్ చేస్తున్నారని, ఈ పరిస్థితిలో విభజన జరిగిన పక్షంలో ఆ రెండు ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం కావచ్చునని ఆయన అభిమతం. విభజన అంటూ జరిగితే కొత్త రాష్ట్రాల డిమాండ్ కేవలం సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకే పరిమితం కాదని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి డిమాండ్లు పుట్టుకొస్తాయని, కాంగ్రెస్ నాయకత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందని ఆయన వాదనగా కనిపిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఏ విధమైన సంక్షోభం తలెత్తబోదని, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకుండా తాను చూసుకోగలనని ఆయన తన నివేదికలో అధిష్టానానికి హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ముగ్గురు నలుగురు పార్లమెంటు సభ్యులు, ఐదారుగురు శాసనసభ్యులు మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి తాను సమీకరించగలనని అధిష్టానానికి ముఖ్యమంత్రి హామీ ఇవ్వనున్నట్టు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+