మేమే గెలిచాం: సత్తాపై ఎవరి లెక్కలు వారివి

ఈ నేపథ్యంలో తమ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తాయి. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే విషయం పక్కన పెడితే.. ఏకగ్రీవాల్లోనే ఆయా పార్టీలు తమ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందంటే తమ పార్టీ గెలిచిందని చెబుతున్నారు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండే దిన పత్రికల్లోను దాదాపు అలాగే వచ్చాయి. గ్రామస్థాయిలో జరిగే సర్పంచ్ ఎన్నిక కావడంతో ఏ పార్టీ మద్దతుదారులు ఎన్ని స్థానాల్లో గెలిచారో అప్పుడే చెప్పడం కష్టమేనని కూడా అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దిన పత్రికలో జగన్ పార్టీ మద్దతుదారులు 855 స్థానాల్లో గెలిచినట్లుగా ఇచ్చింది. సీమాంధ్రలో స్పష్టమైన ఆధిక్యం కనబర్చగా, తెలంగాణలో గణనీయ స్థానాలు గెలుచుకుందని చెప్పింది. మొదటి స్థానంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు 855 గెలుచుకోగా, కాంగ్రెస్ 715, టిడిపి 421, టిఆర్ఎస్ 92 గెలుచుకున్నట్లుగా పేర్కొంది.
ఈనాడులో కాంగ్రెసు మద్దతుదారులు 764, తెలుగుదేశం 570, వైయస్సార్ కాంగ్రెసు 400, తెరాస 88, ఆంధ్రజ్యోతి ప్రకారం కాంగ్రెసు 764, టిడిపి 548, వైయస్సార్ కాంగ్రెసు 428, తెరాస 87 చోట్ల ఏకగ్రీవమయ్యారు. నమస్తే తెలంగాణ ప్రకారం తెలంగాణలో కాంగ్రెసు 200, తెరాస 123, టిడిపి 63, బిజెపి 6, వైయస్సార్ కాంగ్రెస్ 15 ఏకగ్రీవమయ్యాయి.
టిడిపి బుధవారం రాత్రి ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయిన వాటిల్లో 1547 పంచాయతీల వివరాలు తాము సేకరించగా వాటిలో 500కు పైగా తమకు దక్కాయని, కాంగ్రెసుకు 334, వైయస్సార్ కాంగ్రెసుకు 190, తెరాసకు 43 ఉన్నాయని వెల్లడించింది. తమ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మైసూరా రెడ్డి ప్రకటించారు.












Click it and Unblock the Notifications