తెలంగాణ: కాంగ్రెస్‌కు నో చెప్తున్న కెసిఆర్

తెలంగాణ ఇస్తే తెరాస కాంగ్రెసులో విలీనం అవుతుందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. అధిష్టానం కూడా దీనిపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా సమాచారం. కెసిఆర్ విలీనం చేస్తే కాంగ్రెసు పార్టీ మరింత బలోపేతమవుతుందని అధిష్టానం భావిస్తుందట. అలా కాకపోయినా తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చునని భావిస్తున్నారట. అయితే విలీనానికి సిద్ధంగా లేని కెసిఆర్... తెలంగాణ కాంగ్రెసు ఇచ్చినా ఆ క్రెడిట్ ఆ పార్టీకి వెళ్లకుండా ఉండేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట.
తెలంగాణ వచ్చాక కూడా తెరాస ఉంటుందని, విలీనం ప్రసక్తే లేదని కెసిఆర్ చెబుతున్నారట. కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందనే నమ్మకం లేదని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే వరకు ఆ పార్టీని నమ్మేది లేదని చెబుతున్నారు. అయితే ఆ పార్టీ బిల్లు పెట్టినా కెసిఆర్ విలీనానికి సిద్ధపడటం లేదట. అయితే తెలంగాణ ఇస్తే కాంగ్రెసును ఎలా ఎదుర్కోవాలనే విషయమై ఆయన ఇప్పటికే పక్కా ప్రణాళికతో ఉన్నారట.
కాంగ్రెసు తెలంగాణ ఇచ్చినా... తెలంగాణ రాష్ట్ర సమితి లేకుంటే నీరు, ఉద్యోగాలు, భూములు తదితర విషయాల్లో తెలంగాణ రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉందని కాబట్టి అందుకే అన్ని అంశాలు పూర్తయ్యే వరకు తెరాస ఉండాల్సిందేనని ఆయన ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారట. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని చిత్ర రూపంలో తెలంగాణవ్యాప్తంగా ప్రదర్శించి... ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి, అందులో తెరాస పాత్రను వివరించేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే కాంగ్రెసు తెలంగాణను ప్రకటిస్తే ప్రజల నుండి అనూహ్య మద్దతు లభిస్తుందని, అప్పుడు కెసిఆర్ తమ పార్టీతో విలీనం లేదా పొత్తు పెట్టుకునే పరిస్థితి తప్పదని కొందరు కాంగ్రెసు నేతలు భావిస్తున్నారట. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకపోయినా పక్కా వ్యూహంతో వెళ్లి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకునేందుకు కెసిఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారట. అయితే కెసిఆర్ విలీనంపై పునరాలోచన చేసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications