రివర్స్: చంద్రబాబు ఎదురుదాడితో ఆత్మరక్షణలో జగన్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన రాజకీయ, మానసిక యుద్ధానికి సిద్ధమయ్యారు! లోకేష్ కడప జిల్లాలో తిష్టవేశారు. కడప జిల్లా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి పెట్టని కోట.
అలాంటి కడప జిల్లాలో వైసిపిని దెబ్బతీయడమే లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల జగన్ తీరు.. టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్‌లకు ఆగ్రహం తెప్పిస్తోందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతానని జగన్ రెండు రోజుల క్రితం చెప్పారు.
అంతేకాదు, తాను అధికారంలోకి వచ్చేందుకు రెండేళ్లు మూడేళ్లు కావొచ్చునని, ప్రభుత్వాన్ని కూల్చేస్తానని జగన్ పలుమార్లు చెప్పారు. వాటిని తెలుగుదేశం పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదని అంటున్నారు. అయితే, ప్రతి దానిని జగన్ రాజకీయం చేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని వారు భావిస్తున్నారు.

జగన్ పైన ఇలాగే మౌనంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని భావించిన తెలుగుదేశం జగన్ పైన రివర్స్ అటాక్ చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాపు ఉద్యమం నేపథ్యంలో.. కులాలను జగన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు బలంగా భావిస్తున్నారు.
దానికి తోడు నిత్యం మరో 20 మంది ఎమ్మెల్యేలు తన వైపు వస్తారని, వారు తనతో టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వాన్ని కూలుస్తానని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు టిడిపి నేతల మరింత ఆగ్రహానికి గురయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారనే వాదనలు ఉన్నాయి.
మరో వాదన కూడా ఉంది. చంద్రబాబు తన ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్‌కు గురి చేస్తున్నారని తెలిసే జగన్ ఆత్మరక్షణ కోసం... తనతో టిడిపి ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని చెప్పి ఉంటారని కూడా చెబుతున్నారు.
ఏపీలో అయిదుగురు వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. మరికొంతమంది చేరవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్... జగన్ ఇలాకా కడప పైన ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు. అందుకోసమే ఆయన అక్కడే తిష్ట వేశారు.
జగన్‌ను ఆయన ఇలాకాలోనే రాజకీయంగా దెబ్బతీసేందుకు లోకేష్ ఎత్తులు వేస్తున్నారంటున్నారు. కడప జిల్లాలో ప్రథమ శ్రేణి నాయకుల పైన లోకేష్ దృష్టి సారించారు. వారి తర్వాత ద్వితీయ శ్రేణి వైసిపి నాయకులపై కూడా ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇతర జిల్లాలో బాలకృష్ణ ఇతర నేతలు పని చేస్తున్నారట.
లోకేష్ చేసేది మైండ్ గేమ్ అనుకున్నా మరేమనుకున్నా.. వైసిపి నుంచి టిడిపిలోకి చేరికల కోసం ఆయన మాత్రం కడపలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారట. లోకేష్ ఇప్పుడు ఏకంగా కడపలోను అడుగుపెట్టేసరికి జగన్ ఆత్మరక్షణలో పడ్డారని అంటున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications