మారుతున్న లెక్కలు - చంద్రబాబు కీలక నిర్ణయాలు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతోంది. ప్రభుత్వం - పార్టీ పరంగా కీలక నిర్ణయాలకు సీఎం చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. రెండేళ్ల పాలన పైన సమీక్ష చేస్తూనే.. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా మార్పులకు కసరత్తు చేస్తున్నారు. అందు లో భాగంగా పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటుగా ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.
పాలనా పరమైన సమీక్ష.. భవిష్యత్ కార్యాచరణ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ నెల 7-8 తేదీల్లో సచివాలయం కేంద్రంగా ఈ సదస్సు నిర్వహించనుంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై కీలక చర్చ జరగనుంది. పాలన, అభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన జిల్లాలకు రెవెన్యూ శాఖ ర్యాంకులు ప్రకటించనుంది. ప్రభుత్వం 'ఈ-ఆఫీస్' విధానానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలెక్టర్లతో చర్చించనున్నారు.

దీంతోపాటు ప్రజా ఫిర్యాదులు, ఫైళ్ల పరిష్కారం అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత రెండు నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన వంటి కీలక అంశాలపైనా ఈ సదస్సు లో చర్చించనున్నారు. తొలి రోజు సదస్సులో కలెక్టర్లను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.
చంద్రబాబు కీలక దిశా నిర్దేశం
అజెండాలో భాగంగా ముందుగా 'స్వర్ణాంధ్ర-2047'పై చర్చిస్తారు. దీనిలో పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, లాజిస్టిక్స్, తక్కువ ధర ఇంధనం, విద్యుత్ వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్, ఉత్పాదకత వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. రెండో అంశంగా జీఎ్‌సడీపీని చేర్చారు. 2025-26 ఆర్థికసంవత్సరంలో సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా పురోగతి వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే, కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్) అమలుపై కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.
ప్రజల సానుకూల స్పందనపై సమాచార శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఏ జిల్లాల్లో ప్రజల స్పందన ఎలా ఉంది?. ఏ పథకంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారో తెలిపేలా ఆయన వివరిస్తారు. తొలి రోజు సదస్సులో చివరి అంశంగా పెట్టుబడుల ప్రతిపాదనలు, వాటి గ్రౌండింగ్‌పై చర్చించనున్నారు. శాంతిభద్రతల అంశంపై రెండో రోజు కీలక చర్చ జరగనుంది. సదస్సులో తొలుత సంజీవని ప్రాజెక్టు, వేసవి ప్రణాళికలపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. చివరగా సీఎం చంద్రబాబు కలెక్టర్‌లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.













Click it and Unblock the Notifications