జగన్ 'మావిగన్' సవాల్ వెనుక 15-29 సమీకరణం? ఏంటీ లెక్క ?

ఏపీలో రాజధాని రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు (Chandrababu) అమరావతి (Amaravati) నిర్మాణాన్ని వేగవంతం చేయడం, ఇక్కడ అవినీతిని కారణంగా చూపుతూ వైఎస్ జగన్ (YS Jagan) దాన్ని వ్యతిరేకించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే క్రమంలో జగన్ తెరపైకి తెచ్చిన మరో ప్రత్యామ్నాయం మావిగన్ (Mavigun). గతంలోనే ఈ పేరును జగన్ ప్రతిపాదించగానే టీడీపీతో పాటు కూటమి పార్టీలు ట్రోలింగ్ మొదలుపెట్టాయి. అయితే తాజాగా జగన్ మరోసారి వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి సమీకరణంతోనే ముందుకెళ్తామని చేసిన ప్రకటన కూటమి తప్పనిసరిగా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్ధితుల్ని కల్పిస్తోంది.

Advertisement

దీని వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా మేథావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఇవాళ ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన జగన్ మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ విసిరిన సవాల్ వెనుక కీలక కారణం ఉందని తెలిపారు. అదే 15 వర్సెస్ 29 సమీకరణం. ప్రస్తుతం అమరావతి కోర్ రాజధానిలో మొత్తం 29 గ్రామాలున్నాయి. ఇవన్నీ కలిపినా ఒక పూర్తి నియోజకవర్గం కాదు. ఇవన్నీ తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు అమరావతి ప్రత్యేక నియోజకవర్గంగా మారుతుంది.

Advertisement

అలాగే జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ పరిధి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్ల పరిధిలో దాదాపు 15 నియోజకవర్గాలున్నాయి. ఇందులో మచిలీపట్నం నుంచి ప్రారంభిస్తే పెడన, పెనమలూరు, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమ, మంగళగిరి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, తెనాలి, పొన్నూరు వంటి నియోజకవర్గాలు వస్తాయి. ఇవన్నీ కలిపితే 15 అసెంబ్లీ సీట్ల వరకూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 15 సీట్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ మంగళగిరి అసెంబ్లీ సీటు పరిధిలో మాత్రమే ఉన్నాయి.

Advertisement

కాబట్టి చంద్రబాబు అమరావతి రాజధానిగా చెప్తున్న 29 గ్రామాలకూ, ఈ 15 మావిగన్ నియోజకవర్గాలకూ మధ్య యుద్దంగా వచ్చే ఎన్నికల్ని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు చలసాని శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ 15 నియోజకవర్గాల్లో జనాభా దాదాపు 30 లక్షలకు పైగా ఉంటుంది. కానీ రాజధాని గ్రామాల్లో చూస్తే లక్ష మంది కూడా లేరు. దీన్ని బట్టి తన మావిగన్ ప్రతిపాదనకు ఎక్కువ నియోజకవర్గాల్లో మద్దతు లభిస్తుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.