అమిత్ షా జోక్యం కోరిన వైఎస్సార్సీపీ- ఈ మూడు విషయాల్లో..!

ఏపీలో వైఎస్సార్సీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) పర్యటనల సందర్భంగా భద్రతా వైఫల్యాలపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ.. ఇవాళ కేంద్రాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)కు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలతో పాటు డీఎస్సీ అక్రమాలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదులు విన్న హోంమంత్రి.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement
కాక్రోచ్ లకు మద్దతుగా వైఎస్సార్సీపీ..! కేంద్రం తీరును తప్పుబడుతూ..!
Advertisement

ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిసిన వైసీపీ ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్‌ జిల్లాల పర్యటనల్లో వరుసగా భద్రతా వైఫల్యాలు చోటుచేసుకుంటున్నాయని అమిత్‌ షాకు వివరించారు. ఇటీవల దేవరపల్లి పర్యటనకు భారీగా హాజరైనా సరిపడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా జగన్‌ రాష్ట్ర పర్యటనలన్నింటిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. జగన్‌ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జగన్‌కు పటిష్టమైన భద్రత కల్పించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర అమిత్ షాకు వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ హల్‌చల్..! భార్యతో కలిసి..!

వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన అమిత్‌ షా.. జగన్‌ భద్రత అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు డీఎస్సీ అక్రమాలు, రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై వారు ఫిర్యాదు చేశారు.
డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా దుర్వినియోగం, అవినీతి జరిగిందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టులను అమిత్‌ షాకు వివరించారు. రెండు నెలల్లో రాష్ట్రంలో నాలుగు లాకప్‌ మరణాలు సంభవించాయని తెలిపారు.
అలాగే భారతి సిమెంట్స్‌ను అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు రాష్ట్రంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని గుర్తుచేశారు.