కాక్రోచ్ లకు మద్దతుగా వైఎస్సార్సీపీ..! కేంద్రం తీరును తప్పుబడుతూ..!
నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల అక్రమాలకు బాధ్యతగా కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళనలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పతాకస్దాయికి చేరాయి. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ కు బయలుదేరిన విద్యార్దులపై పోలీసులు చేసిన బలప్రయోగం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) స్పందించింది.
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే కాదు, అది నిలబెట్టబడుతున్నట్లు కనిపించాలి కూడా అంటూ కేంద్రానికి చురకలు అంటిస్తూ వైఎస్సార్సీపీ ఇవాళ ఓ ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తున్న నిరసనలను బాధ్యతాయుతంగా, సున్నితంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వైసీపీ కోరింది. ప్రభుత్వాలు వారి నిజమైన ఆందోళనలను ఆలకించి, అర్థవంతమైన పరిష్కారాల దిశగా కృషి చేయాలని సూచించింది. శాంతియుత నిరసన అనేది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, అదే సమయంలో, ప్రతిఒక్కరూ సంయమనం పాటించి, నిరసనలు శాంతియుతంగా ఉండేలా చూడాలని కోరింది.

Democracy must not only be upheld, but must also be seen to be upheld.
— YSR Congress Party (@YSRCParty) July 21, 2026
The protests by students and young people in New Delhi should be handled with responsibility and sensitivity. Governments must listen to their genuine concerns and work towards meaningful solutions. Peaceful…
నీట్ పేపర్ లీక్ ఘటన, పరీక్షా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులలో ఉన్న విశ్వాసాన్ని కదిలించిందని, ఈ నేపథ్యంలో, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడం అత్యవసరమని వైసీపీ తెలిపింది. ఏపీలోకూడా డీఎస్సీ పరీక్షల్లో లీకులు, అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని, ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా పరిగణించకుండా, ఒక స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరపాల్సిన అవసరం ఉందని వైసీపీ సూచించింది. అది నీట్ అయినా, డీఎస్సీ అయినా, విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని తెలిపింది. నిజాన్ని వెలికితీయడం, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ కర్తవ్యమని వైసీపీ గుర్తుచేసింది.












Click it and Unblock the Notifications