బిగ్ టర్న్- బీజేపీకి రివర్స్ షాక్?
తమిళనాడులో సంచలన విజయం సాధించింది.. తమిళగ వెట్రి కజగం (టీవీకే). 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 108 స్థానాల్లో జెండా ఎగురవేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. డీఎంకే- 59, ఏఐఏడీఎంకే- 47, కాంగ్రెస్- 5, పీఎంకే- 4 సీట్లు స్థానాలకు పరిమితం అయ్యాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచారు విజయ్. కాంగ్రెస్ మద్దతును తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో టీవీకేకు మద్దతు ఇవ్వడానికి ఏఐఏడీఎంకే సైతం ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి డీఎంకే- ఏఐఏడీఎంకే మధ్య పొత్తు కుదురవచ్చని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితుల మధ్య మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని ఏఐఏడీఎంకే భావిస్తోన్నట్లు ఇండియా టుడే తెలిపింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అన్నాడీఎంకేకు చెందిన విశ్వసనీయ వర్గాలను తన కథనంలో ఉటంకించింది. పళనిస్వామికి సన్నిహిత వర్గాల ద్వారా ఈ సమాచారం అందినట్లు వివరించింది. ఎన్డీఏ నుండి వైదొలగడంతో సహా విస్తృత రాజకీయ సర్దుబాట్లను పరిశీలిస్తోంది ఏఐఏడీఎంకే.
మొన్నటి ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయిందనే విషయం తెలిసిందే. దీంతో ఇతర పార్టీల సహకారం తప్పనిసరి అయింది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది గానీ సీట్లు చాలవు. కాంగ్రెస్ నుంచి గెలిచింది అయిదుమందే. దీంతో టీవీకే 112 స్థానాల వద్దే నిలిచిపోయింది. మిగిలిన సీట్లను భర్తీ చేసుకోవడానికి వీసీకే వంటి చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. అవి కొలిక్కి రావట్లేదు.
దీంతో ఓ ప్రధాన పార్టీతో సహకారం తీసుకోక తప్పట్లేదు టీవీకేకు. ఈ క్రమంలో ఏఐఏడీఎంకే ముందుకొచ్చింది. అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచన తమకు ఎంత మాత్రం లేదని డీఎంకే కూడా తేల్చి చెప్పడంతో.. విజయ్ తో చేతులు కలపడానికి ఏఐఏడీఎంకేకు లైన్ క్లియర్ అయింది. ఇక్కడ బీజేపీతో ఉన్న పొత్తు అడ్డుగా ఉంటోన్న నేపథ్యంలో తెగదెంపులు చేసుకోవాలని పళనిస్వామి నిర్ణయానికొచ్చినట్లు ఇండియా టుడే పేర్కొంది.












Click it and Unblock the Notifications