సునేత్రా పవార్ ప్రభంజనం: దేశంలోనే సరికొత్త రికార్డు!
మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లో అజిత్ పవార్ సతీమణి, ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అభ్యర్థి సునేత్రా పవార్ కళ్లు చెదిరే విజయాన్ని నమోదు చేశారు. పుణె విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందడంతో ఖాళీ అయిన ఈ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఆమె ఏకంగా 2,18,930 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం కేవలం బారామతి చరిత్రలోనే కాదు.. భారత ఎన్నికల చరిత్రలోనే ఓ అసెంబ్లీ అభ్యర్థి సాధించిన అతిపెద్ద మెజారిటీగా రికార్డు సృష్టించింది. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్‌లో సునీల్ కుమార్ శర్మ పేరిట ఉన్న 2.14 లక్షల మెజారిటీ రికార్డును సునేత్రా పవార్ అధిగమించారు.
ఈ ఎన్నికల్లో సునేత్రా పవార్‌కు తిరుగులేని మద్దతు లభించింది. ఆమె కుమారులు జై పవార్, పార్థ్ పవార్ చేసిన విజ్ఞప్తులు, అజిత్ పవార్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి ఓట్ల రూపంలో వెల్లువెత్తింది. ఎంతలా అంటే.. ఆమెపై పోటీ చేసిన మరో 22 మంది అభ్యర్థులలో ఒక్కరు కూడా 1,000 ఓట్ల మార్కును దాటలేకపోయారు. కరుణా ముండేకు 125 ఓట్లు, అభిజీత్ బిచుకులేకు 121 ఓట్లు మాత్రమే వచ్చాయంటే బారామతిలో పవార్ కుటుంబం పట్టు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019లో అజిత్ పవార్ స్వయంగా సాధించిన మెజారిటీ రికార్డును కూడా సునేత్రా ఇప్పుడు తిరగరాయడం విశేషం.

ఇంతటి భారీ విజయం సాధించినప్పటికీ.. సునేత్రా పవార్ అత్యంత హుందాతో వ్యవహరించారు. అజిత్ పవార్ మరణం తర్వాత వచ్చిన ఫలితాలు కావడంతో ఎవరూ విజయ్ ఉత్సవాలు జరపవద్దని ఆమె కోరారు. "ఈ గెలుపును నేను అజిత్ దాదా పవిత్ర స్మృతికి అంకితం చేస్తున్నాను. బారామతి ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ దాదాను ప్రేమించే కార్యకర్తలు ఎవరూ బాణాసంచా కాల్చవద్దని, గులాల్ చల్లుతూ సంబరాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనమందరం సంయమనం పాటిస్తూ దాదా ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందాం" అని ఆమె సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరితంగా కోరారు.
పార్థ్ పవార్ మాట్లాడుతూ.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాము ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన ఈ భారీ తీర్పుకు తాము రుణపడి ఉంటామని, త్వరలోనే ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సభలు నిర్వహిస్తామని తెలిపారు. "ఇది ముగింపు కాదు.. అజిత్ దాదా కన్న కలల బారామతిని నిర్మించే దిశగా ఇది ఒక కొత్త ఆరంభం" అని సునేత్రా పవార్ పేర్కొన్నారు. ఈ విజయంతో మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబం తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది.












Click it and Unblock the Notifications