మరో పర్యాటక అద్భుతం.. హుస్సేన్ సాగర్ బుద్ధుడి చుట్టూ స్కైవాక్!

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టి మూసి పరివాహక ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కూడా మరింత అందంగా ఆకర్షణీయంగా మారుస్తుంది.

Advertisement

హుస్సేన్ సాగర్ చుట్టు అత్యాధునిక సర్క్యులర్ స్కైవాక్

ఇందులో భాగంగా హుస్సేన్ సాగర్ పైన దృష్టి సారించింది. హుస్సేన్ సాగర్ ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్ చుట్టు అత్యాధునిక సర్క్యులర్ స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ లో ఏర్పాటు చేసిన అందమైన ప్రపంచ ప్రసిద్ధ ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని చూడడం కోసం బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది పర్యాటక శాఖ.

Advertisement

బౌద్ధ టూరిజం పైన ప్రత్యేకమైన దృష్టి

అయితే తాజాగా స్కైవాక్ ద్వారా హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని వివిధ కోణాల నుంచి చూసేలా ప్లాన్ చేసింది. ముఖ్యంగా సాయంత్రంవేళలో హుస్సేన్ సాగర్ నీటిఅందాలను, మధ్యలో ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని స్కైవాక్ ద్వారా చూసే అపూర్వమైన దృశ్యాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం సంకల్పించింది. హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం మాత్రమే కాదు, బౌద్ధ టూరిజంపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.

బౌద్ధ క్షేత్రాల పైన ఫోకస్

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బౌద్ధ క్షేత్రాల పైన ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఈ మేరకు ప్రణాళికలను రచిస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ వనాన్ని అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం 274 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది.

Advertisement

బౌద్ధ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు ప్లాన్

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భారీ బుద్ధ స్తూపం నిర్మించనుంది. ఫణిగిరి, నేలకొండపల్లి, బుద్ధవనం, హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తూ బౌద్ధ టూరిజం సర్క్యూట్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది మాత్రమే కాకుండా వీకెండ్ టూరిజం ప్రోత్సహించడానికి ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను కూడా తీసుకురానుంది. మొత్తంగా హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం చుట్టూ స్కైవాక్ ఏర్పాటు చేస్తే అప్పుడు బుద్ధ విగ్రహాన్ని చూసే అనుభూతే వేరుగా ఉంటుంది.

English Summary

hussain sagar skywalk: Telangana Government plans to construct a Circular Skywalk around Hussain Sagar in Hyderabad. Major boost to Buddhist tourism with development of Buddha Vanam, Nelakondapalli and special tourism circuits.