హర్యానాలోని సోనిపట్ లో మానవత్వానికే మచ్చగా నిలిచే ఓ దుర్మార్గ ఘటన చోటు చేసుకుంది. వ్యాపారవేత్త అయిన తండ్రి తన జీవిత చరమాంకంలో వృద్ధాశ్రమంలో చనిపోతే కనీసం కుమార్తెలు అంత్యక్రియలకు (Farewell) కూడా రాకుండా కేవలం వీడియో కాల్ లోనే వాటిని చూసిన ఘటన దేశవ్యాప్తంగా పలువురిని కంటతడి పెట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ (VC sajjanar) దీన్ని షేర్ చేశారు. అంతే కాదు ఈ అవమానవీయ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారని, ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే అంటూ సజ్జనార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?! అని ఆయన ప్రశ్నించారు. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ దృశ్యమే ప్రత్యక్ష నిదర్శనం అన్నారు.