దేశంలోనే తొలిసారి కోహెడలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల హబ్.. ప్రత్యేకతలివే!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య రంగానికి చాలా ప్రాధాన్యతనిస్తోంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అనేక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సమీపంలోని కోహెడలో దేశంలోనే తొలి అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. తెలంగాణ మత్స్య రంగానికి ఈ నిర్ణయంతో కొత్త వెలుగు రాబోతోంది.

Advertisement

త్వరలో రేవంత్ చేతుల మీదుగా అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం శంకుస్థాపన

కోహెడ లో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రాన్ని సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో 47 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. దీనికి ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 2027 ఆగస్టు నాటికి పనులను పూర్తి చేసి కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చు చేస్తూ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

Advertisement

మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణా

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మంజూరైన ఈ ప్రాజెక్టు ఎంతోమంది మత్స్యకారుల జీవితాలను మార్చనుంది. తెలంగాణ రాష్ట్రం మంచినీటి చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 2025లో రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల విలువైన చేపలు, రొయ్యలు ఉత్పత్తి అయ్యాయి. అయినప్పటికీ ఎగుమతులు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. చేపల కోసం సరైన నిల్వ వసతులు, ప్రాసెసింగ్ సౌకర్యం, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఉత్పత్తికి తగిన సప్లై లేదు.

చేపలు, రొయ్యల నిల్వ, ఎగుమతి చేసేలా అన్ని ఏర్పాట్లు, కస్టమ్స్ క్లియరెన్స్ కూడా ఇక్కడే

దీంతో గణనీయంగా చేపలు, రొయ్యలు ఉత్పత్తి చేసినా ఉత్పత్తి వృధా అవుతోంది. ఈ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రంలో చేపలు, రొయ్యలను నిలువ చేయడం కోసం అధునాతన శీతల గిడ్డంగులు, చేపల శుద్ధి యూనిట్లు, కస్టమ్స్ క్లియరెన్స్ సౌకర్యాలు, శిక్షణా కేంద్రాలు, హోల్ సేల్ మార్కెట్, అతిథి గృహాలు వంటివి ఏర్పాటు చేస్తారు.

Advertisement

అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్రం.. 5 వేల మందికి ఉపాధి

అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మించడం వల్ల ఇతర దేశాలకు చేపలు రొయ్యలను వేగంగా సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల రవాణా, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, లోడింగ్ , అన్లోడింగ్ తదితర రంగాలలో సుమారు 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఇది స్థానికులకు, మత్స్య రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్న వారికి నిజంగా శుభవార్త అని చెప్పాలి.

English Summary

International Fish Export Centre first in india to be set up at Koheda in Hyderabad outskirts. Rs 47 crore project to provide employment to 5000 people and boost Telangana fish exports.