బిట్స్ పిలానీ ప్రొఫెసర్ల ఆవిష్కరణ.. కిడ్నీ బాధితులకు నిజంగా వరం!

హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఒక అద్భుత ఆవిష్కరణ చేశారు. వైద్య సాంకేతిక రంగంలో ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని బిట్స్ పిలానీ యూనివర్సిటీ ప్రొఫెసర్ లు అందించారు. మూత్రపిండాల పనితీరులో ఏవైనా లోపాలను కేవలం నిమిషాల వ్యవధిలో గుర్తించే చిన్న పోర్టబుల్ పరికరాన్ని వారు విజయవంతంగా తయారు చేశారు. ఈ ఆవిష్కరణ వల్ల రోగులు ఆసుపత్రులు లేదా డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.

Advertisement

స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసి టెస్టింగ్ పరికరం

ఇంటి వద్ద లేదా గ్రామీణ ప్రాంతాల్లోనే సులభంగా పరీక్షలు చేయవచ్చు. ఈ పరికరం లేజర్ గ్రాఫేన్ సాంకేతికత మరియు అధునాతన ఎలక్ట్రోకెమికల్ సెన్సార్లపై ఆధారపడి పని చేస్తుంది. దీని ద్వారా శరీరంలోని మూడు ముఖ్యమైన బయోమార్కర్లు - క్రియాటినైన్, యూరియా మరియు యూరిక్ యాసిడ్ - స్థాయిలను ఖచ్చితంగా కొలవవచ్చు. పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసి, ప్రత్యేక బ్రౌజర్ అప్లికేషన్ ద్వారా ఫలితాలను తక్షణం తెలుసుకోవచ్చు.

Advertisement

బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌ ప్రొఫెసర్స్ ఆవిష్కరణ

ఇది రోగులకు మాత్రమే కాకుండా, వైద్యులకు కూడా రియల్-టైమ్ డయాగ్నోసిస్‌లో భారీ సహాయం చేస్తుంది. బిట్స్ హైదరాబాద్ క్యాంపస్‌కు చెందిన డా. పార్వతి నాయర్, డా. స్వయంశ్రీ, డా. ఆర్.ఎన్. పొన్నాలగు మరియు డా. సంకేత్ గోయల్ తదితర ప్రొఫెసర్ల బృందం ఈ పరిశోధనకు నాయకత్వం వహించింది. సాధారణంగా కిడ్నీ సమస్యలను గుర్తించడానికి రక్తం లేదా మూత్ర నమూనాలు తీసి ల్యాబ్‌లలో పరీక్షించాల్సి వస్తుంది.

ఎక్కడికైనా తీసుకువెళ్లగల పరికరం

దీనికి సమయం, ఖర్చు మరియు ప్రయాణం అవసరమవుతాయి. కానీ ఈ కొత్త గ్యాడ్జెట్ ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. ఇది చాలా చిన్నది, తేలికగా ఉండి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.
పరిశోధకులు తమ ల్యాబ్‌లో ఈ పరికరాన్నిఅన్ని విధాలా పరీక్షించారు. ఫలితాలు అత్యంత ఖచ్చితమైనవిగా ఉన్నాయని వారు తెలిపారు. ఈ సంబంధిత అధ్యయనం ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ 'సైన్స్ డైరెక్ట్'లో ప్రచురితమై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల అభినందనలు అందుకుంది.

Advertisement

ఈ పరికరం ద్వారా కిడ్నీ సమస్యల త్వరిత నిర్ధారణ

ఈ ఆవిష్కరణ ముఖ్యంగా గ్రామీణ మరియు సబర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. అక్కడ వైద్య సౌకర్యాలు పరిమితంగా ఉండటం వల్ల చాలా మంది కిడ్నీ సమస్యలు తీవ్రమైన దశకు చేరుకునే సమయానికి గుర్తింపు జరుగుతుంది. ఈ పరికరం ద్వారా త్వరిత నిర్ధారణ సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ పరికరాన్ని మరింత మెరుగుపరచి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి వాణిజ్యీకరణ చేయడానికి బృందం కృషి చేస్తోంది. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.

English Summary

kidney function testing mobile device: BITS Pilani Hyderabad professors have developed a portable mobile device that detects kidney function defects in minutes using laser graphene and electrochemical sensors. It measures creatinine, urea, and uric acid levels via smartphone, revolutionizing point-of-care diagnostics.