120 ఎకరాల్లో మెగా లెదర్‌ పార్క్‌ ..కేంద్రానికి తెలంగాణా ప్రతిపాదన, అనుమతి కోరిన ఎంపీ!

తెలంగాణా రాష్ట్రంలో అనేక కీలక పరిశ్రమలకు, కీలక ప్రాజెక్ట్ లకు కేంద్రం నుండి తెలంగాణాప్రభుత్వం సహకారం కోరుతోంది. తెలంగాణా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిచేయటం మాత్రమే కాకుండా, తెలంగాణాలో ఉన్న యువతకు ఉపాధి కల్పించటం కోసం సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం పలు మెగా ప్రాజెక్ట్ ల ప్రతిపాదనలను కేంద్రం ముందు పెడుతోంది. ఈ క్రమంలో జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్‌ పార్క్‌కు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

Advertisement

మెగా లెదర్‌ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలన్న ఎంపీ

అయితే ఇప్పటివరకు దానికి కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలలో జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ప్రతిపాదించిన మెగా లెదర్‌ పార్క్‌కు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదం తెలపాలని వరంగల్‌ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కోరారు. లోక్‌సభలో రూల్‌-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ, తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు.

Advertisement

120 ఎకరాల్లో మెగా లెదర్‌ పార్క్‌కు రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనలు

ఉపాధి కల్పనకు దోహదపడే కీలక ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ప్రభుత్వం గుర్తించిన 120 ఎకరాల్లో తెలంగాణ స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మెగా లెదర్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రంలో లెదర్‌ పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాల లభ్యతతో పాటు ఎఫ్‌డీడీఐ, నిఫ్ట్‌, గిల్ట్‌ వంటి సంస్థల సహకారం కూడా అందుబాటులో ఉందని వివరించారు.

అన్ని వసతులు ఉన్నాయి.. ఆమోదం ఇవ్వాలన్న ఎంపీ

ఈ ప్రాజెక్టు అమలైతే ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు చెందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కేంద్రం నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నారు. ఉపాధి కల్పనకు దోహదపడే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చి ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖను వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.

Advertisement
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్ .. ఆగస్ట్ 9న నల్లబెల్లికి రాక!

గతంలోనూ అనేకమార్లు కేంద్రానికి విజ్ఞప్తి

గతంలోనూ ఈ మెగా లెదర్ పార్క్ కోసం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిశారు . మెగా లెదర్ పార్కుల అభివృద్ధికి కేంద్ర సహాయాన్ని అందించాలని ఆయన కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్లో, జనగాం జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ లోను ఏర్పాటు చేసే మెగా లెదర్ పార్కులకు అనుమతి ఇవ్వాలన్నారు.

English Summary

Mega Leather Park: Warangal MP Dr. Kadiyam Kavya urges Centre in Lok Sabha under Rule 377 to immediately approve Station Ghanpur Mega Leather Park for generating employment in the region.