డెడ్ స్టోరేజ్ కి నాగార్జున సాగర్ నీటిమట్టం.. ఏపీ, తెలంగాణాలకు డేంజర్ బెల్స్!


తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు తాగునీటి, సాగునీటికి పెను గండంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ సంవత్సరం కృష్ణ బేసిన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా, ఎగువ ప్రాంతాల నుండి కూడా ఆశించిన మేరకు వరద రాకపోవడంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి.

Advertisement

సాగర్ నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు.. ఉమ్మడి ఆయకట్టు పరిధిలో తీవ్ర ఆందోళన

ప్రస్తుతం నాగార్జునసాగర్ నీటిమట్టం అట్టడుగుకు చేరుకోవడంతో సాగర్ ఉమ్మడి ఆయకట్టు పరిధిలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. అయితే ప్రస్తుతం జలాశయంలో 513 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ స్టోరేజ్ 510 అడుగులు అంటే మరో మూడు అడుగుల నీరు కిందికి వెళితే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిని వాడుకోవడానికి వీలుండదు.

Advertisement

డేంజర్ బెల్స్ మోగిస్తున్న సాగర్ నీటిమట్టం

సాగర్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం 312 టిఎంసిలు, అయితే ప్రస్తుతం 138 టీఎంసి ల నీరు మాత్రమే నాగార్జునసాగర్ లో ఉంది. నాగార్జునసాగర్ సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చలేని స్థితికి చేరుకుంటున్న క్రమంలో సాగర్ నీటి మీద ఆధారపడిన ప్రాంతాలలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు ఇప్పటికే నాగార్జున కుడి, ఎడమ కాలువలకు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు.

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు

కేవలం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఏ ఎమ్ ఆర్ పి ద్వారా అత్యంత తక్కువగా 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 510 అడుగుల డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఊహించని జల సంక్షోభం తలెత్తుతుంది. సాగర్ నీటిమట్టం 500 అడుగుల కంటే కిందికి పడిపోతే కాలువలు, ప్రధాన గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉండదు.

Advertisement

డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటే పరిస్థితి ఇలా

రెండు తెలుగు రాష్ట్రాలలోని కృష్ణ ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. లక్షలాది ఎకరాలలో పంటలు సాగు చేసే రైతులు పీకల్లోతు కష్టాల్లో పడతారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటే ఆ తర్వాత నాగార్జునసాగర్ నీటి వినియోగం కృష్ణా నది యాజమాన్య బోర్డు మరియు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోకి వెళుతుంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పైన కఠినమైన ఆంక్షలు విధిస్తారు.

వారికి లక్షరూపాయల ఆర్ధిక అండ.. అప్లై చేసుకోమంటున్న తెలంగాణా సర్కార్!

కే ఆర్ ఎం బి నిర్ణయంతోనే నీటి వినియోగం

సాగర్ కుడి, ఎడమ గట్టులపై ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తారు. ఇక సాగర్ లో ఉండే కొద్దిపాటి నీరు తాగునీటి అవసరాల కోసం మాత్రమే రిజర్వ్ చేస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఒక్క చుక్క నీటిని కూడా కేటాయించరు. రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్ నీటిని ఇష్టానుసారంగా వాడుకునే హక్కును కోల్పోయి కే ఆర్ ఎం బి నిర్ణయంతోనే అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, అవసరం మేరకు నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే సంకేతాలు ఉన్నాయి.

English Summary

Nagarjuna Sagar Project is nearing its dead storage level. Currently, the water level in the reservoir stands at 513 feet. with this danger bells to irrigation and drinking water too.